సిద్దిపేట, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు అక్రమార్కులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత శాఖ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు అందినా నామమాత్రపు చర్యలు మా త్రమే తీసుకుంటున్నారనే అపవాదు ఉంది. పైసా పెట్టుబడి లేకుండా అధికారులను మచ్చిక చేసుకొని మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమార్కులు మట్టి దందా ను కొనసాగిస్తున్నారు. రోజురోజుకూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అవసరమైతే భౌతిక దాడులకు దిగుతున్నారు. ఈ చీకటి దందా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జోరుగా కొనసాగుతున్నా యంత్రాం గం గట్టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నియోజకవర్గాల్లో మట్టి దందా కొనసాగుతున్నది. ఈ దందా వెనుక కొంతమంది అధికార పార్టీ నేత ల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలో ఉన్న గుట్టలను, ఏనేలను అక్రమార్కులు ఎంచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలలలోని దుద్దెడ, తిమ్మారెడ్డిపల్లి, కుకునూర్ పల్లి, సిద్దిపేట శివారు ప్రాంతాల నుంచి, వర్గల్, కోహెడ, బెజ్జంకి, చిన్నకొడూరు మండలాలతో పాటు కొమురవెల్లి మండలాల నుంచి ఎక్కువ మొత్తంలో మట్టిని తరలిస్తున్నారు.సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అక్రమ మట్టిదందా జోరుగా కొనసాగుతున్నది. రాత్రివేళల్లో జేసీబీలతో టిప్పర్లలో మట్టిని నింపి తరలిస్తున్నారు. రాత్రివేళ వీటిని అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై భౌతికదాడులకు దిగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వద్ద ఉన్న మట్టిని రాత్రిపూట యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రాజెక్టు మట్టి తరలింపు కొంతమంది నీటి పారుదల శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు అరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అక్రమార్కులు రెచ్చి పోతున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని గుట్టలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. జిల్లాలోని జాతీయ రహదారులు, పరిశ్రమలు, రిజర్వాయర్లు ఉన్నాయి. వీటితో జిల్లాలోని భూములకు మంచి డిమాండ్ ఉంది. ప్రధానమైన పట్టణాల్లో ఇంటి నిర్మాణాలతో పాటు వెంచర్లకు మట్టి అవసరాలు పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని మట్టి దందాను నడిపిస్తున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణాలు పెరిగాయి.దీంతో మట్టి అవసరాలు బాగా పెరిగాయి. ఇదే అదునుగా మట్టి ధరలను ఇష్టారీతిగా పెంచేస్తున్నారు. స్థానికంగా ఉన్న గుట్టలను, రిజర్వాయర్లు నిర్మించిన వద్ద ఉన్న మట్టిపై అక్రమార్కులు కన్నేసి దానిని రాత్రి వేళల్లో తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ 3వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. మట్టి రకాన్ని బట్టి రేటును నిర్ణయిస్తున్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న రైల్వే ట్రాక్, జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి.వీటి అవసరాలకు మట్టిని అధికారికంగా తరలిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని వాటి పేరు మీద కొంతమంది అధికారుల అం డదండలతో అక్రమార్కులు మట్టి దందా నడిపిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన టిప్పర్లకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు మట్టిని తరలించాలి. కానీ, ఇదే అదునుగా చేసుకొని కొందరు అక్రమార్కులు రాత్రివేళల్లో అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ రాత్రివేళల్లో దందా సాగుతోంది.ప్రభుత్వ, ప్రైవేట్ తవ్వకాలకు సంబంధించి రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వా త జిల్లా మైనింగ్ అధికారుల అనుమతి పొందా ల్సి ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో ఇలా జరగడం లేదు.
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా జరుగుతున్న మట్టి దం దాలో రెవెన్యూ, మైనింగ్, నీటి పారుదల శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు పోలీస్ శాఖ అక్రమార్కులకు పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులు ముందే అధికారులకు రేటు ఫిక్స్ చేస్తున్నారు. టిప్పర్‌కు ఇంత ఇవ్వాలి అని లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం వాటాలను అధికారులకు అందిస్తున్నారు. ఒకవేళ అధికారి వినకపోతే బడా నేతలు రంగంలోకి దిగుతున్నారు. నయానో బయానో వారిని ఒప్పిస్తున్నారు. లేకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. మట్టి దందాలో అందరికీ వాటాలు పోతున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వద్ద, ప్రధాన కాల్వల మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. దీనికి కొందరు అధికారులు అక్రమార్కులకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది చేత టిప్పర్లను కొనిపించి వారితో దందాను అధికారులే చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా జరుగతున్నా ఉన్నతస్థాయి అధికారుల చర్యలు మా త్రం శూన్యం. పేరుకు మాత్రమే టాస్క్‌ఫోర్స్‌లు తప్పా పెద్దగా ప్రయోజనం లేదన్న విమర్శలు ఉన్నాయి.