మెదక్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా..అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం సీఎం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య గా చెప్పవచ్చు. తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నియంత్రిస్తామని, బెల్ట్‌షాప్‌లను తొలిగిస్తామని ఎన్నికలప్పుడు రేవంత్‌రెడ్డి ప్రతి వేదికపైన హామీలిచ్చాడు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్నదనే రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మద్యపానాన్ని నియంత్రించడం దేవుడెరుగు, ప్రతి పల్లెలో బెల్ట్‌షాప్ ఏర్పాటవుతున్నది. పల్లెల్లో నీళ్లన్నా దొరుకుతయో లేవో కాని, మద్యం మాత్రం రాత్రీపగలు తేడాలేకుండా దొరుకుతున్నది. దీంతో మద్యం మత్తులో ఘాతుకాలు, నేరాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వైన్స్‌లకు టెండర్లు పిలిచి వైన్స్‌లు కేటాయించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు రుసుం పెంచడంతో గతంలో కంటే ఎక్కువ ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. మద్యం ఆదాయంపైనే బండి రేవంత్ సర్కారు లాగిస్తున్నది.
ఊరూరా బెల్ట్‌షాప్‌లు…
మెదక్ జిల్లాలో 49 వైన్స్ షాపులు, 5 బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఊరూరా బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. ఒక్కో బెల్ట్షాప్లో నిత్యం రూ.5 నుంచి రూ.10 వేల అక్రమంగా మద్యం అమ్మకాలు సాగుతున్నట్లు తెలిసింది. అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో నెలకు ఒక బెల్టు షా పులో రూ.లక్ష వరకు మద్యం అమ్మకాలు సాగుతున్నా యి. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతున్నారు. క్వార్టర్ బాటిల్ పై రూ.20 నుంచి 30 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు.
బీర్లపై రూ. 20 అదనంగా వసూలు చేస్తున్నారు. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాలు, పట్టణాల్లోని వైన్ షాపుల నుంచి బెల్టు షాప్‌లకు మద్యం సరఫరా అవుతున్నది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సా గుతున్నా ఎక్సైజ్ , పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెల్ట్‌షాపుల నిర్వాహకులు సమయపాలన లేకుండా 24గంటలు మద్యం విక్రయిస్తున్నారు. కిరాణా షాప్ లు, హోటళ్లు, దాబాలు, పాన్‌షాపులు, ఇండ్లలో మద్యం అమ్మకాలు చేస్తున్నారు. 44వ జాతీయ రహదారిపై తూప్రాన్, రామాయంపేట, చేగుంట, మనోహరాబాద్‌తో పాటు పలు గ్రామాల శివారులో ఏర్పాటు చేసిన బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలతో మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
మెదక్-హైదరాబాద్ రోడ్డుపై నర్సాపూర్, కౌడ్పల్లి, కుల్చారంతో పాటు పలు గ్రామాల్లో బెల్టు షాప్‌లు ఏర్పాటు చేసి సమయపాలన లేకుండా అ మ్మకాలు చేస్తున్నారు. చిన్న శంకరంపేట, పాపన్నపేట, టేక్మాల్,. అల్లాదుర్గం, రేగోడ్, పెద్దశంకరంపేట మండలాల్లో రో డ్లు వెంట బెల్టుషాప్‌లు నడుస్తున్నా యి. బెల్ట్ట్ షాప్‌ల నిర్వాహకులు ప్రతినెలా ఎక్సైజ్, పోలీసులకు మామూ ళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెద క్ జిల్లాలో 2025 డిసెంబర్లో మొత్తం రూ.90.24 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. వీటిలో 89,775 ఐఎంఎల్ కేసు లు, 84,575 బీర్ కేసులు, మొత్తం రూ. 90.24 కో ట్ల మద్యం అమ్మారు. డిసెంబర్ 31న ఒక్క రోజు 3,364ఐఎంఎల్ కేసులు, 2998 బీరు కేసుల మద్యం తాగారు. దీని విలువ రూ. 3.64 కోట్లు ఉం టుంది. గతేడాది 2024 డిసెంబర్లో రూ.58.54 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలి స్తే ఈసారి రూ. 31.07 కోట్లు అధికంగా అమ్మకాలు జరిగాయి. మొన్నటి డిసెంబర్ 31న మెదక్ జిల్లాలో ఒక్కరోజే రూ.3. 64 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

పెరిగిన నేరాలు.. ఘాతుకాలు..
మెదక్ మండలంలోని రాజ్‌పల్లిలో చాకలి నర్స వ్వ (75) అనే మహిళను ఆమె కుమారుడు మద్యానికి బాని సై, మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఈనెల 12న హత్యచేశాడు. రామాయంపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీకి చెందినబౌరి సాంబసింగ్ (55) మద్యం మత్తులో కాలుజారి మృతి చెందాడు. పేద కుటుంబం కావడంతో కాలనీవాసులు చందా లు వేసుకు ని సాంబసింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామంలో అతిగా మద్యం తాగి శ్రీకాంత్ అనే వ్యక్తి తన తండ్రి లక్ష్మయ్యను కర్రతో తలపై కొట్టి చంపా డు. కొన్ని గ్రామాల్లో రాత్రిళ్లు ప్రభుత్వ పాఠశాలల వద్ద మద్యం సిట్టింగులు నడుస్తున్నాయి. తాగిన మైనంలో అక్కడే మద్యం సీసలు పగులకొట్టడంతో స్కూల్ తలుపు లు, కిటికీలు ధ్వంసం చేసిన ఘటనలు ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్నాయి. అధికా ర యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
మద్యనిషేధం అమలుకు తీర్మానాలు…
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో తమ కుటుంబాలు నాశనం అవుతున్నాయని మహిళలు రోడ్డెక్కుతున్నారు. మద్యం తాగి వచ్చి తమవారు గొడవలకు దిగుతున్నారని, ఇండ్లు గుల్ల అవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. దీంతో బెల్ట్‌షాప్‌లు తొలిగించాలని, మద్యాన్ని నియంత్రించాలని పలు గ్రామాల్లో మహిళలు ఆందోళనలకు దిగుతున్నారు.ఇటీవల రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మద్యపాన నిషేధం కోసం గ్రామస్తులు తీర్మానం చేశారు. మద్యనిషేధం ఉల్లఘించిన వారికి రూ. 50 వేల జరిమానా విధిస్తామ ని తీర్మానం చేశారు. మద్యం అమ్మకాలు చేస్తున్న వారి సమాచారం ఇస్తే రూ. 10 వేలు బహుమతి ఇస్తామని గ్రామస్తులు ప్రకటించారు. ఇటీవల కొల్చారంలో తీర్మానం చేశారు. చిన్న శంకరంపేట మండలంలోని అంబాజీపేటలో మద్యనిషేధం అమలుకు గ్రామస్తులు తీర్మానం చేశారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లిలో ఈనెల ఈనెల 12న గ్రామసభ నిర్వహించి, సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో గ్రామంలో మద్యం విక్రయించరాదని, ఎవరైనా విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. మద్యం విక్రయించినట్లు సమాచారం ఇస్తే వారికి రూ.5 వేల బహుమతి అందిస్తామన్నారు. తీర్మానం కాపీపై సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు సంతకాలు చేశారు. మద్యాన్ని నియంత్రించాలని ఇలా ఊరూరూ కదులుతున్నాయి.