సదాశివపేట, మే 9: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 590/1/2/1లో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అసైన్డ్ భూముల్లో కట్టడాలు నిర్మించడం, ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపై బదిలీ చేయించడం చట్టవిరుద్ధ్దం. ఓ కాంగ్రెస్ నాయకుడు తన అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించి అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలు నిర్మించారు. అసైన్డ్ భూమిలో రేకుల షెడ్డు ఏర్పాటు చేసి కమర్షియల్‌గా అద్దెకు ఇచ్చాడు. వ్యాపార నిమిత్తం లీజుకు ఇచ్చి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. సాగుకు ఉపయోగించే అసైన్డ్ భూమి ఎలాంటి అనుమతులు లేకుండా రేకుల్ షెడ్డును నిర్మించి కమర్షియల్‌గా అద్దెకు ఇచ్చి డబ్బులు ఆర్జిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోట్ల రూపాయలు విలువ చేసే అసైన్డ్ భూమిలో నిర్మాణాలు చేపట్టినా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం శోచనీయం. అసైన్డ్ భూమిలో అక్రమ రేకుల షెడ్డు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు శుక్ర వారం కలెక్టర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్, ఆర్డీవో, స్థానిక తహసీల్దార్, మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అసైన్డ్ భూమిలో అక్రమం గా నిర్మించిన నిర్మాణాలను తొలిగించి భూమిని స్వాధీనం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణలు తొలిగించాలి. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 590/1/2/1లో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. షెడ్‌ను అద్దెకు ఇచ్చి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే అక్రమ నిర్మాణాలను కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకోవాలి. అసైన్డ్ పట్టా రద్దు చేసి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. రేకుల షెడ్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి.
– చింతా గోపాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్