అమీన్పూర్, జూన్ 25: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ వెంకటేశం ఆధ్వర్యంలో బుధవారం కూల్చివేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలా ల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వేనంబర్ 993 ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టారంటూ ఫిర్యాదు అందడంతో బుధవారం హైడ్రా అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా ఇన్స్పెక్టర్ బాలగోపాల్ మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే 993,1000 నంబర్లలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. హైడ్రా సర్వే అధికారులు సిబ్బందిచే సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. సర్వే ఆధారంగా ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలితే తదుపరి చర్యలు ఉంటాయన్నారు. సర్వేలో స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పవన్, తహసీల్దార్ వెంకటేశం, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శ్రీమాన్రాజు,రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
పటాన్చెరు రూరల్, జూన్ 25: అనుమతికి మించి అంతస్తులు నిర్మిస్తున్న బిల్డర్లపై పంచాయతీ కార్యదర్శి కొరడా ఝలిపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామంలోని పీఎన్ఆర్ టౌన్షిప్లో అనుమతికి మించి పైఅంతస్తులు నిర్మిస్తున్న ఒక అపార్టుమెంట్‌పై గ్రామ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సిబ్బందితో కలిసి కార్యదర్శి జీ ప్లస్ఫోర్ నిర్మిస్తున్న భవనం పైఅంతస్తు స్లాబ్‌ను కటింగ్ మెషిన్లతో కూల్చివేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ ఇంద్రేశం గ్రామ పరిధిలో అక్రమ కట్టడాలు, పర్మిషన్‌కు మించి నిర్మాణాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులు వచ్చిన వాటిపై తక్షణం చర్యలు తెలిపారు. గురువారం కూడా మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.