పటాన్చెరు/అమీన్పూర్, సెప్టెంబర్ 22: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్లలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. పటేల్‌గూడ పంచాయతీ పరిధిలోని బీఎస్సార్ కాలనీ సర్వేనెంబర్ 12లో 25 భవనాలను నేలమట్టం చేశారు. కిష్టారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆరు అంతస్తుల భవనంతో పాటు ఐదు అంతస్తుల రెండు భవనాలను బాహుబలి జేసీబీ ద్వారా కూల్చివేశారు.
ఐలాపూర్ పంచాయతీ పరిధిలోని రెండు భారీ అంతస్తులు కలిగిన అపార్ట్మెంట్లను కూల్చివేయనున్నట్లు తెలిసింది.కిష్టారెడ్డిపేట్‌లో సర్వేనెంబర్ 164లో 500 గజాల్లో 5 అంతస్తుల భవనం నిర్మాణం రెండు నెలల క్రితం పూర్తిచేసి రెండు రోజుల క్రితమే పిల్లల దవాఖాన ప్రారంభించారు. ఈ దవాఖానలో చిన్నారులకు వైద్యం కొనసాగిస్తుండగానే కూల్చివేతల కోసం తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు హుకుం జారీచేశారు. వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ను మున్సిపల్ సిబ్బంది ఖాళీ చేయించి నిమిషాల వ్యవధిలో కూల్చివేశారు.
ఆదివారం ఉదయం 6 గంటలకు హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చారు. పటాన్చెరు డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీసు భద్రత నడుమ కూల్చివేతలు ప్రారంభించారు. కూల్చివేతల కొనసాగింపు రాత్రి వరకు కొనసాగింది.కూల్చివేతల సమాచారం ప్రజలకు తెలియడంతో వందలాది మంది అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగేందుకు యత్నించగా పోలీసులు వారించారు. బీఎస్ఆర్ కాలనీ పక్కనే ఉన్న సర్వేనెంబర్ 12లో సుమారు 16 భవనాలను కూల్చివేశారు.
ఆ భవనాల్లో ఎక్కువ మంది కిరాయికి ఉంటున్నారు. వారిని అధికారులు అప్పటికప్పుడు ఖాళీ చేయించి కూల్చివేయడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆగమేఘాల మీద గంటల వ్యవధిలో కూల్చివేస్తే తాము అప్పటికప్పుడు ఎక్కడికెళ్లి తల దాచుకోవాలంటూ కిరాయిదారులు కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి మంచివి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతల్లో హైడ్రా డీఎస్పీ శ్రీనివాస్, పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, స్థానిక తహసీల్దార్ రాధ, కమిషనర్ జ్యోతిరెడ్డి, ఇన్స్పెక్టర్లు సదా నాగరాజు, స్వామిగౌడ్, లాల్నాయక్, విద్యుత్తు ఏఈలు మణికంఠ, వెంకట్రామిరెడ్డి, టీపీవో పవన్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.