సిద్దిపేట, మార్చి 23: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలపై చిన్నచూపు చూస్తున్నదని, బడ్జెట్లో వారికి కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చుచేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో ఆదవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇఫ్త్తార్ విందు అనేది సిద్దిపేటలో మొదలైన నేడు దేశవ్యాప్తంగా కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వ పరంగా మొదటిసారిగా దావతే ఇఫ్తార్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని తెలిపారు. హైదరాబాద్ తర్వాత తొలి హజ్‌హౌస్ సిద్దిపేటలో నిర్మించుకున్నట్లు చెప్పారు.
పేదల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కోసం రూ. 3300 కోట్లు కేటాయించి రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ హయాం నుంచి సిద్దిపేటలో గంగా జమునా తెహజీబ్ నడుస్తోందన్నారు. రంజాన్ పండుగకు ప్రభుత్వపరంగా రంజాన్ తోఫాతో పాటు ఇఫ్తార్ విందు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇఫ్తార్ విందులను అధికారికంగా నిర్వహించకుండా ముస్లింలను విస్మరించిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకుల పాఠశాలలను ఇంటిగ్రేటెడ్‌లో కలపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
మైనార్టీ గురుకుల పాఠశాలల్లో నమాజ్‌తో పాటు అరబ్బీ ఇంగ్ల్లిష్ మీడియంలో విద్యా బోధన చేస్తారన్నారు. ఈ పాఠశాలలు ఇంటిగ్రేటెడ్‌లో కలిపితే ముస్లిం విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. ఏటా పదిమంది నిరుపేద ముస్లింలను తన సొంత డబ్బులతో ఉమ్రాయాత్రకు పంపుతున్నట్లు ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. సిద్దిపేట డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సుమారు 700 నిరుపేద ముస్లింలకు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇమామ్‌లకు ప్రభుత్వ నుంచి గౌరవ వేతనాలు ఇచ్చిందన్నారు.
తనకు హిందువులు, ముస్లింలు రెండు కండ్లలాంటి వారని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోనే ఆఖరి సఫర్ వాహనం ప్రారంభించుకున్నామని, నేడు ఇది దేశానికి ఆదర్శంగా నిలిచి అమలవుతోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నాగరాజ్‌రెడ్డి, అక్తర్ పటేల్, సుందర్, వజీర్, మోయిజ్, తిరుమల్‌రెడ్డి, శ్రీహరి, శ్రీకాంత్, నయ్యర్ పటేల్, ఇర్షాద్ హుస్సేన్, జావిద్, బాబు జానీ, వహిద్ అక్బర్, అజీజ్, ఆదాబ్ మోహిజ్, బాసిత్ తదితరులు పాల్గొన్నారు.