మీ ఆడబిడ్డగా తనను ఆశీర్వదిస్తే, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్న సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు. గురువారం కౌడిపల్లి మండలంలోని కంచన్‌పల్లి, బుర్గుగడ్డ, పాంపల్లి, సదాశివపల్లి, ధర్మసాగర్, కౌడిపల్లి తదితర గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
కౌడిపల్లి, నవంబర్ 23: వ్యవసాయానికి మూడు గంట కరెంట్ చాలన్న కాంగ్రెస్ కావాలా.. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కావాలా రైతులు ఆలోచించుకుని ఓటు వేయాలని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కౌడిపల్లి మండలంలోని కంచన్‌పల్లి, బుర్గుగడ్డ, పాంపల్లి, సదాశివపల్లి, ధర్మసాగర్, కౌడిపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌడిపల్లి కేంద్రంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. బ్యాండ్ బాజా, డప్పుచప్పుళ్లతో ఆటపాటలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ, ర్యాలీల మధ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మీ ఆడబిడ్డగా తనను ఆశీర్వాదిస్తే, ఎమ్మెల్యే అన్న మదన్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు సౌభాగ్యలక్ష్మి అందిస్తామని, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటకలాగా కరెంట్ గోస పడాల్సిందేనని, ప్రజలారా మీ ఓటు రైతుబంధుకు వేస్తారో లేదా రాబంధులకు వేస్తారో ఆలోచించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొదన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని, కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలు అమలుచేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవితా అంబర్‌సింగ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సారా రామాగౌడ్, మండల వైస్ ఎంపీపీ నవీన్‌గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మానర్సింహారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు హైమద్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, కౌడిపల్లి ఎంపీటీసీ కాలేరు మంజుల శివాంజనేయులు, నాయకులు దుర్గారెడ్డి, నర్సింగ్‌రావు, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ తదితరలు పాల్గొన్నారు.