
గజ్వేల్, డిసెంబర్14: ‘నమ్మకాన్ని నిలబెట్టుకుంటా!.. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తా.. క్షేత్రస్థాయిలో శక్తి వంచన లేకుండా ప్రజా సేవ చేస్తా.. పార్టీకి నమ్మకమైన కార్యకర్తలా పనిచేస్తా.. కీలక పాత్ర వహించి, నన్ను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం ఆయన గజ్వేల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. అటు వైద్య, సామాజిక రంగంలో, ఇటు రాజకీయ పరంగానూ ప్రజలకు అందించిన సేవా తాత్పరుడికి ఎమ్మెల్సీగా దక్కిన అవకాశంపై వివరాలు ఆయన మాటల్లోనే..
సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశంపై మీ స్పందన?
ప్రియతమనేత, తెలంగాణ రథసారథి, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి జీవితాంతం రుణపడి ఉంటా. హృదయపూర్వక ధన్యవాదాలు. నా గెలుపులో కీలకపాత్ర వహించిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఉమ్మడి జిల్లా ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు జడ్పీటీసీలు, ఎంపీటీసీలందరికీ కృతజ్ఞతలు. ఏ నమ్మకంతో నాకు ఈ బాధ్యతలను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అప్పగించారో, ఆ గురుతర బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేరుస్తా. ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా.
మీకున్న అనుభవంతో భవిష్యత్‌లో ఎలాంటి సేవలందిస్తారు?
35 ఏండ్ల నుంచి ప్రజలతో మమేకమై, రాజకీయాల్లో కొనసాగుతున్నా. గతంలో సర్పంచ్‌గా, ఏఎంసీ చైర్మన్‌గా సేవలందించా. నాకున్న అనుభవం, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ప్రజలకు సేవలందిస్తా. పార్టీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడేవిధంగా సేవచేస్తా.
నియోజకవర్గం నుంచి ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజలకు మీ శైలిలో ఏవిధంగా సేవలుఅందిస్తారు?
ఈ వయస్సులో కూడా నాపై విశ్వాసంతో ప్రజలకు సేవలందించడానికి అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. గతంలో నేను గజ్వేల్ నియోజకవర్గ పరిధికి పరిమితమైనది వాస్తవమే. అప్పటి మంత్రి గీతారెడ్డి హయాంలోనూ ఉమ్మడి జిల్లా ప్రజలకు క్రియాశీలకంగా పని చేసి, చక్కని సేవలందించా. నా గురించి, నా పనితీరు జిల్లా ప్రజలకు ఇప్పటికే తెలుసు. ఈ విషయాన్ని కూడా గుర్తించి, సీఎం కేసీఆర్ నాకు అవకాశం కల్పించారు. గతం కన్నా రెట్టింపు ఉత్సాహంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవలందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తా.
డాక్టర్ నుంచి ఎమ్మెల్సీ వరకు ప్రస్థానం
డాక్టర్ వంటేరి యాదవరెడ్డి 1981లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసి పట్టా సాధించారు. 1983 నుంచి గజ్వేల్‌లో జ్యోతి మెటర్నిటీ నర్సింగ్‌హోం ద్వారా ప్రజలకు వైద్య సేవలందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ శాఖ అధ్యక్షుడిగా సేవలందించారు. గజ్వేల్‌లో లయన్స్‌క్లబ్ ఆఫ్ గజ్వేల్‌ను ప్రారంభించి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ లయన్స్‌క్లబ్, జ్యోతి మెటర్నిటీ నర్సింగ్‌హోం ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. సరోజినీ కంటి దవాఖాన సహకారంతో ఉచిత కంటి వైద్యశిబిరాల ద్వారా ప్రజలకు వైద్యసేవలందించారు. అందించిన సేవలకు గాను వివిధ సంస్థల నుంచి ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1987 నుంచి 1992 వరకు క్యాసారం గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అటు రైతులకు, ఇటు ప్రజలకు ఎనలేని సేవలందించడంతో పాటు వంటిమామిడిలో సబ్‌మార్కెట్ యార్డు ప్రారంభానికి కృషి చేశారు. 2013లో టీఆర్ఎస్లో చేరిన డాక్టర్ యాదవరెడ్డి, ఆనాటి నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గెలుపునకు కృషి చేయడంతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ చక్కని పాత్ర పోషించారు. పార్టీకి అత్యంత విశ్వాసపాత్రునిగా కొనసాగడంతో పాటూ గజ్వేల్ నియోజకవర్గంలోనూ మంచిపేరును సంపాదించుకున్నారు. పార్టీ అధిష్టానం, సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తనవంతు బాధ్యతలు నిర్వహిస్తూ క్రమశిక్షణ గల కార్యకర్తగా, నాయకునిగా పేరుపొందాడు. అటు వైద్యుడిగా, ఇటు రాజకీయ నాయకుడిగా, మరోవైపు పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారు.
వైద్యుల కుటుంబం… గజ్వేల్‌కు అంకితం
డాక్టర్ యాదవరెడ్డిగానే గజ్వేల్‌తో పాటు పరిసర ప్రాంతాలకు తెలిసిన డాక్టర్ వంటేరి యాదవరెడ్డి స్వగ్రామం క్యాసారం. ప్రస్తుతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనమయ్యింది. యాదవరెడ్డి కుటుంబంలో భార్య రమాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మిగతా వారంతా వైద్యులే. యాదవరెడ్డి కుమారుడు డాక్టర్ జయంత్‌రెడ్డి యూరాలజీ నిపుణుడు కాగా, కోడలు డాక్టర్ శ్వేత గైనకాలజీ నిపుణురాలు. కూతురు డాక్టర్ జ్యోతి కంటి వైద్య నిపుణురాలిగా గజ్వేల్ దవాఖానలో వైద్యసేవలందిస్తున్నారు. అల్లుడు డాక్టర్ శంతన్‌రెడ్డి చిన్న పిల్లల వైద్య నిపుణులు. ఆయన గజ్వేల్ దవాఖానలోనే వైద్యసేవలు అందిస్తున్నారు.