అమీన్పూర్ నవంబర్ 18: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురికాలనీలో రహదారిపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 848లో వేసిన వెంచర్లో రహదారిపైన ఓ నిర్వాహకుడు ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. దీంతో వందనపురి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు లింగమయ్యతో పాటు కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ విచారణ చేపట్టడంతో కబ్జా చేసినట్లు తేలింది. అందుకు హైడ్రా అధికారులు సోమవారం తెల్లవారుజామున జేసీబీ సహాయంతో కూల్చివేతలు పూర్తి చేశారు.
పెద్ద చెరువు నాలాపై అక్రమ నిర్మాణాన్ని సోమవారం అమీన్పూర్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేతలతో పాటు కేసులు తప్పవని హెచ్చరించారు.
మున్సిపాలిటి పరిధిలో మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించి రహదారులు, ఎఫ్టీఎల్, బఫర్జోలోని నిర్మాణాలను పరిశీలించనున్నట్లు సమాచారం. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఇప్పటికే అనేకసార్లు కమిషనర్ పర్యటించి విచారణ చేపట్టారు. అందులో భాగంగానే నేడు రానున్నట్లు తెలిసింది.