అమీన్పూర్ డిసెంబర్ 16: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడ పరిధిలోని సర్వేనెంబర్ 12లో ఇటీవల హైడ్రా ఆధ్వర్యంలో కూల్చేసిన ఇండ్ల వ్యర్థాలను సోమవారం తెల్లవారుజామున హైడ్రా సిబ్బంది తొలిగించడం ప్రారంభించారు. హైడ్రా రాకతో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల గుండెల్లో పరుగులు మొదలయ్యాయి.
దీంతో మళ్లీ తమ ఇండ్లను ఎక్కడ కూల్చివేస్తారనే భయం కాలనీల్లో చర్చనీయంశమైంది. ఎట్టకేలకు బీఎస్సార్ కాలనీ ముందున్న 24 ఇండ్ల నిర్మాణాల వ్యర్థాలను తొలిగించి ఆ స్థలాలను ప్రభుత్వం ఆధీనం చేసుకుంటుందని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఈ కూల్చివేతల వివాదం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు అత్యుత్సాహంతో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.