అమీన్పూర్, నవంబర్ 19: అమీన్పూర్ మున్సిపలిటీ పరిధిలోని అలుగులు, చెరువులు, తూములను మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులను కలిసి న్యాయం చేస్తామంటూ భరోసా కల్పించారు. పద్మావతి నగర్, వాణినగర్, చక్రపురి కాలనీ, వెంకటరమణ కాలనీ, వెదిరి కాలనీల్లోని వివాదాస్పద స్థలాలు, ఎప్టీఎల్, బఫర్ ప్రభుత్వ స్థలాలను కాలినడకన తిరిగి కమిషనర్ పరిశీలించారు.అనంతరం బాధితులు, స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అక్కడి నుంచి శంభునికుంటలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు.
అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించినట్లు తెలిపారు. చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగు, తూములు మూసివేయడంతో నీరు వచ్చి చాలామంది ప్లాట్లు మునిగిపోయాయని గుర్తించామని, ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. అమీన్పూర్లో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతానికి గురైనట్లు పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వస్తుండడంతో ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించినట్లు తెలిపారు. కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు. పద్మావతి నగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కబ్జా చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని, సర్వేచేసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో భారీ భవనాలపై ఎన్జీటీలో కేసులు ఉన్నాయని, వాటిని కూలంకశంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంకటరమణ కాలనీలో గోల్డెన్ కీ నిర్మాణదారులు పార్కు స్థలాల ఆక్రమణపై హైడ్రా అధికారులు ఇప్పటికే సర్వే చేశారని తెలిపారు. మరోసారి పరిశీలించి పార్కులు, ఓపెన్ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారణ అయితే హైడ్రా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చెరువులు, కుంటలు పునరుద్ధ్దరించడంతోపాటు రోడ్లను, పార్కులను ఆక్రమించకుండా హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.