కంది, సెప్టెంబర్ 27: ఇరవై ఐదు ఏండ్ల తర్వాత మంజీరా బ్యారేజ్‌కు భారీ స్థాయిలో వరద వచ్చిందని హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాలకు వచ్చే వరదతో హైదరాబాద్‌కు నీటి సరఫరా అయ్యే సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం పెద్దాపూర్ పంప్‌హౌస్ పూర్తిగా నీటమునిగింది. శనివారం వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి నీట మునిగిన పంప్‌హౌస్‌ను శనివారం పరిశీలించారు. అనంతరం సంగారెడ్డి ఐబీలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
పంప్‌హౌస్ పక్క నుంచి మూడు వరద కాలువలు ప్రవహించి ఒకే దగ్గర కలుస్తున్నందున రెండు మీటర్ల ఎత్తున్న ఫిల్టర్ బెడ్ గోడను దాటుకొని పంపుహౌస్‌లోకి వరద చేరిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వరదలు రావడంతో పంప్‌హౌస్ మునిగి పోయిందన్నారు. నీరు చేరిన వెంటనే మోటర్లను నిలిపివేశామని, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. దీంతో హైదరాబాద్‌కు రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయిందని, వరద తగ్గిన వెంటనే మోటర్లను బాగు చేయించి నీటి సరఫరా చేస్తామని ఎండీ తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వరద వచ్చిందని, రెండు రిజర్వాయర్ల నుంచి ఒకే సారి 35వేల క్యూసెక్కు వరద కిందికి వదలడంతో మూసి నదికి ఉధృతి మరింత పెరిగిందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండ హైడ్రా, పోలీస్‌శాఖ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో అధికారులు రామకృష్ణ, బ్రిజేష్ పాల్గొన్నారు.