హుస్నాబాద్ టౌన్, జూలై 11: ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శుక్రవారం మానవ అక్రమ రవాణా, మహిళల హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని విద్యాలయాలకు పంపుతున్నారని ఆ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలన్నారు. చదువులు ఇష్టంతో సాగిస్తే అనుకున్న స్థానానికి చేరుకునేందుకు సులువు అవుతుందని ఈ విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని ఎస్ఐ లక్ష్మారెడ్డి అన్నారు. చదువుకునే వయసులో సోషల్ మీడియాలో మత్తులో పడి విద్యార్థులు తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని, మాయమాటలను నమ్మి ప్రేమ అనే పేరుతో మోసపోవద్దని ఎస్ఐ సూచించారు. ఎవరైనా వేధించిన, ఇబ్బందుల గురి చేసిన పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. గంజాయి తదితర మత్తు పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాటికి బానిసలు కాకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఎస్సై లక్ష్మారెడ్డి అన్నారు.