హుస్నాబాద్, జూలై 31: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ చినుకు పడిందంటే చిత్తడిగా మారుతోంది. నిత్యం ప్రయాణికులు, బస్సులతో కళకళలాడే ఈ బస్టాండ్‌కు ప్రతి వానకాలంలో వరదముప్పు ఎదురవుతున్నది. భారీ వర్షం కురిస్తే బస్టాండ్ ఆవరణ మొత్తం వర్షపు నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తున్నది. కొన్నేండ్లుగా ఈ సమస్య వేధిస్తున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు పట్టించుకోక పోవడం లేదు.
1984లో నిర్మించిన ఈ బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలతో లోతట్టు ప్రాంతంగా తయారైంది. దీనికి ఎత్తు పెంచి వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లే చర్యలు చేపట్టడం లేదు. బయట నుంచి వచ్చే వర్షపు నీటిని అదుపు చేయడంలోనూ అధికారులు విఫలమయ్యారు. దీంతో ప్రతి వానకాలంలో ప్రయాణికులకు, ఆర్టీసీ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. బస్టాండ్ నుంచి కాలినడకన వెళ్లాలంటే మోకాలిలోపు వర్షపు నీటిలో, బురదలో వెళ్లాల్సి వస్తోంది. వర్షం పడిన ప్రతిసారి ఇదే తంతు కొనసాగడంతో ప్రయాణికులు విసుగు చెందుతున్నారు.
నిరుపయోగంగా ఆధునీకరణ పనులు
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనుల కోసం ఇటీవల ప్రభుత్వం రూ.2కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో బస్టాండ్ ఆవరణలో సీసీ నిర్మాణం, బస్టాండ్ భవనానికి సీలింగ్, పెయింటింగ్, నూతన మరుగుదొడ్లు, అదనపు ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం చేపట్టారు. భవనం స్లాబ్‌కు సైతం మరమ్మతులు చేసినా వర్షం పడినప్పుడు బస్టాండ్ మొత్తం ఊరుస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
బస్టాండ్ ఆవరణలో వేసిన సీసీ పనులు ప్రణాళిక ప్రకారం వేయక పోవడంతో పెద్ద ఎత్తున నిలిచిపోతోంది. నీరు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడం గమనార్హం. వర్షం అనంతరం నీరు వెళ్లిపోయినా బురదతో నిండి ఉండడంతో దోమలు, పురుగులు చేరి దుర్గంధం వెదజల్లుతోంది. రూ.2కోట్ల నిధులకు మరికొన్ని నిధులు మంజూరు చేయించి పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించి ఎత్తు పెంచితే ఈ ఇబ్బందులు ఎదురు కావని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఇప్పటికైనా బస్టాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.
డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు
బస్టాండ్‌లో వర్షపు నీటిని బయటకు పంపేందుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి పైఅధికారులకు ప్రతిపాదనలు పంపాం. అనుమతులు కూడా వచ్చాయి. త్వరలోనే డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించి వర్షపు నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. భారీ వర్షం పడితే బస్టాండ్ మొత్తం నీటితో నిండిపోతున్నది. ఇందుకు కారణం బయటకంటే బస్టాండ్ ఆవరణ పల్లపు ప్రాంతంలో ఉండటమే.
ఇప్పటికప్పుడు ఎత్తు పెంచడం సాధ్యం కాదు కాబట్టి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
– వెంకన్న, డిపో మేనేజర్ హుస్నాబాద్