అక్కన్నపేట, ఆగస్టు 24: బాలికలు ఆత్మైస్థెర్యంతో ధైర్యంగా ముందుకెళ్లాలని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో మండల న్యా యసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు ఉన్నతమైన లక్ష్యం తో చదువుకోవాలన్నారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, చిన్నప్పటి నుంచే పిల్లలు క్రమశిక్షణతో పెరిగితే సమాజంలో నేరాలను అరికట్టవచ్చన్నారు. సంవత్సరానికి నాలుగున్నర లక్షలలోపు ఆదాయం కలిగిన వారికి కోర్టు కేసుల పరిష్కారం విషయంలో న్యాయ సహాయాన్ని అందించేందుకు ప్రతి మండలంలో న్యాయసేవాధికార సంస్థ కృషిచేస్తున్నదన్నారు. లోక్ అదాలత్ ద్వారా సివిల్ కేసులను కక్షిదారులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.
రాజీమార్గమే రాజమార్గమని, లోక్అదాలత్లో సివిల్ కేసులు పరిష్కరించడం గొప్ప విషయమన్నారు. నేటి యువత సన్మార్గంలో నడుచుకోవాలని, లక్ష్యంతో చదువుకొని ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడాలన్నారు. గొడవలకు దూరంగా ఉండాలని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయన్నా రు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై విజయభాస్కర్, ఏజీపీ ఒగ్గో జు సదానందం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్, న్యాయవాదులు దికొండ ప్రవీణ్, ఉప్పరపల్లి సంపత్, జేరిపోతుల కిరణ్, కేజీబీవీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ధనలక్ష్మి పాల్గొన్నారు.