హుస్నాబాద్, నవంబర్ 18: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనుల్లో జాప్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో పనులు నెలల తరబడి కొనసాగుతుండటంతో బస్టాండ్ ప్లాట్‌ఫామ్‌లను అధికారులు మార్చారు. దీంతో బస్టాండ్ ఆవరణలోని చెట్లే ప్లాట్‌ఫామ్‌లుగా మారాయి. ఆరు నెలల క్రితం హుస్నాబాద్ బస్టాండ్ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం రూ.2కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా అదనంగా ప్లాట్‌ఫామ్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం, బస్టాండ్‌కు సీలింగ్, ఆవరణలో సీసీ వేసే పనులు చేయాల్సి ఉంది.
ఇందులో కొన్ని పనులు పూర్తయినప్పటికీ మరికొన్ని పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ తాత్సారం చేస్తున్నాడు. బస్టాండ్‌కు సీలింగ్ వేసే పనిలో భాగంగా ప్లాట్‌ఫామ్‌ల వద్ద కర్రలు అమర్చారు. దీంతో బస్టాండ్‌లోకి ప్రయాణికులు వెళ్లే అవకాశం గానీ, బస్సులు ప్లాట్‌ఫామ్‌పై పెట్టే అవకాశం గానీ లేకుండా పోయింది. ప్రయాణికులు చెట్లకిందే ఉండి బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు నెల రోజులగా ఇదే తంతు జరుగుతున్నప్పటికీ సంబంధిత ఆర్టీసీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాఖాలో… అందులో ఆర్టీసీకి సంబంధించిన పనులు నత్తనడకన కొనసాగడం ప్రజల్లో చర్చనీయాంశమైంది.
మంత్రి నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ పనుల్లో జాప్యం జరగడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. బస్టాండ్‌లో సాఫీగా కుర్చీలపై కూర్చుండి బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులు ప్రస్తుతం చెట్ల కిందే గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ ఆధునీకరణ పనులను వెంటనే పూర్తి చేయించి గతంలో లాగా ప్లాట్‌ఫామ్‌లను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆధునీకరణ పనుల్లో జాప్యంపై డిపో మేనేజర్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పనులు కొత్త ఆల స్యంగా జరుగుతున్నమాట వాస్తవమేనని, వారం పదిరోజుల్లో బయటి పనులు పూర్తి చేయించి యథావిధిగా ప్లాట్‌ఫామ్‌ల పైకి బస్సులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.