హైదరాబాద్, మార్చి 19( నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర 2026-27 ఆర్థిక బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. మొత్తం రూ.3.29 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు ఆర్థికశాఖ అధికారుల్లో చర్చ జరుగుతున్నది. ఈ బడ్జెట్‌పై శుక్రవారం ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. ఈ భేటీలోనే ఈ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకురానున్నారు.
ఈసారి బడ్జెట్‌పై పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని, ఆయన భ్రమలను అందిపుచ్చుకొన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. విజన్-2034 పేరుతో బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం. ప్రజల సంక్షేమాన్ని, తెలంగాణ రాష్ట్ర వాస్తవిక అభివృద్ధిని పక్కనబెట్టి ఒక ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం అంటూ ఆర్భాటానికి పోయినట్టు తెలిసింది. దీంతోపాటు తెలంగాణ విజన్-2047 డాక్యుమెంట్ పేరుతో ఫోర్త్ సిటీకి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తున్నది. మూసీ పునరుజ్జీవం, ఆర్ఆర్ఆర్, ఎయిర్‌పోర్ట్‌లు, హైదరాబాద్ మెట్రో రెండో దశ, సిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటికి భారీగా నిధుల కేటాయింపు ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రగతిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సాగునీటి రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్లో అత్తెసరు నిధులనే కేటాయించింది.
ఆ బడ్జెట్లో పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు నామమాత్రంగానే నిధులను కేటాయించింది. బడ్జెట్లో సాగునీటి రంగానికి సంబంధించిన కేటాయింపుల్లో సింహభాగం నిధుల్లో ప్రధానంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకే ప్రాధాన్యతనిచ్చింది. ఆయా జిల్లాల్లోని ప్రాజెక్టులకే ప్రభుత్వం పెద్దపీట వేసింది. దేవాదుల, వరదకాలువ తదితర ప్రాజెక్టులకు కొద్దిమేర నిధులనే విదిల్చింది. చనాకా కొరాట, నీల్వాయి, మత్తడి, ర్యాలీవాగు, జగన్నాథ్‌పూర్, కాళేశ్వరం, నిజాంసాగర్ ఆధునికీకరణకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. కేటాయించిన అరకొర నిధులను సైతం సర్కారు వెచ్చించని దుస్థితి నెలకొన్నది. తాజా బడ్జెట్లోనైనా అన్ని జిల్లాలకు, ప్రాజెక్టులకు నిధులను కేటాయిస్తుందా? అనే చర్చ కొనసాగుతున్నది.
ఈసారి కూడా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దగా నిధుల కేటాయింపులు లేవని, అంతా కలిసి రూ.25 వేల కోట్లకు కొద్దిగా అటూ ఇటుగా ఉండొచ్చని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఈసారి కూడా అటక మీదనే పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో తులం బంగారం, ఆసరా పింఛన్లు, మహిళలకు రూ.2,500 తదితర పథకాల ప్రస్తావన రాలేదని తెలుస్తున్నది. కానీ, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం రూ.5 వేల కోట్ల అంచనా నిధులను బడ్జెట్లో కేటాయింపులు చేసినట్టు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో ఉన్న విద్యాశాఖకు ఈసారి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయిస్తారో? అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. వాస్తవంగా విజన్-2034, విజన్-2047 డాక్యుమెంట్‌పైనే ముఖ్యమంత్రి ఫోకస్ చేసినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నిరుడు రూ.3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి మరో రూ.24 వేల కోట్లను అధికంగానే కలిపి ప్రవేశపెట్టనున్నదన్న చర్చ జరుగుతున్నది. దీంతో ఈసారి బడ్జెట్ రూ.3.29 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
కాలేజీ యువతులకు ఈవీ సూటీలను ఇస్తామన్న హామీ అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. గతంలో విద్యా రంగానికి రూ.23,108 కోట్లు మాత్రమే కేటయించగా, ఇందులో రూ.16,298 కోట్లు జీత భత్యాలు, పరిపాలనా వ్యయం కిందనే రూ.16,298 కోట్లు ఖర్చు అయినట్టు సమాచారం. ఈ బడ్జెట్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు, డీఏల విడుదల, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్లు అని కాంగ్రెస్ తెగ ప్రచారం చేస్తున్నది.
గతంలో రోడ్లు, భవనాల కోసం రూ.5,907 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు తట్టెడు మట్టి తీయలేదని, కిలోమీటర్ దూరం కొత్త రోడ్లు వేయలేదని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు అసెంబీ చర్చల్లో ఘాటుగా విమర్శించారు. ఎస్సీ కులాల అభివృద్ధి కోసం రూ.11,561 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రూ.11,405 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం రూ.3,591 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. కానీ వీటికి 30 శాతం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. మహిళా-శిశు సంక్షేమ శాఖకు రూ.2,962 కోట్లు కేటాయించారు. కానీ ఇందులో నిర్వహణ పద్దులు మినహా అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల స్కాలర్‌షిప్పుల కోసం ఆర్భాటంగా రూ.4,452 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం.. అందులో సగం నిధులనూ ఖర్చు చేయలేదని గణాంకాలే చెప్తున్నాయి.
గత బడ్జెట్ లెక్కలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయని, అవి ఆర్భాటం కోసం పొందుపరిచిన లెక్కలే తప్ప.. క్షేత్రస్థాయిలో అమలయ్యే లెక్కలు కావని గతంలోనే బీఆర్ఎస్ పక్ష ఉప నేత హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజగా మళ్లీ అదే తరహా బడ్జెట్ రూపొదించినట్టు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల కోసం గత బడ్జెట్లో రూ.12,571 కోట్ల నిధులు కేటాయించారు. ఇది జరిగి సంవత్సరం గడిచిపోయింది.
కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఒక్క నిరుపేదను కూడా గృహప్రవేశం చేయించలేదు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.2,900 కోట్లు కేటాయించారు. కానీ ఇందులో 10 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు. వెనుకబడిన కులాల యువతను ప్రోత్సహించడం కోసం చేయూత పథకానికి రూ.14,841 కోట్లు కేటాయించారు. కానీ ఇందులో ఒక్క రూపాయీ ఆ వర్గం యువత ఉపాధి కోసం ఖర్చు చేయకపోవడం గమనార్హం.