కౌడిపల్లి, మార్చి14: భార్యపై భర్త దాడి చేసిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో శుక్రవారం చేటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామవాసి స్వాతికి హైద్రాబాద్ సూరారం రాజీవ్‌గాంధీ కాలనీ వాసి సున్నపు రమేష్‌తో పదేండ్ల క్రితం పెండ్లి జరిగింది. ఐదేండ్లు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలు కలిగారు. భర్త రమేశ్ తన తల్లి చెప్పుడు మాటలు విని, భార్య స్వాతిని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఈ విషయమై గతంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల సమక్షంలో కౌన్సింగ్ ఇచ్చినా అతడిలో మార్పు రాలేదు. ఈనెల 6న స్వాతికి సడన్‌గా కడుపునొప్పి రాగా పరీక్షించిన వైద్యులు గర్బసంచిపై నీటి బుడుగలు ఉన్నాయని చెప్పారు. నాటి నుండి తన భర్త తనకు అక్రమ సంబందం అంటగట్టి, కొట్టడంతోపాటు దుర్భాషలాడుతూ తనను, తన పిల్లలను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని స్వాతి వాపోయారు. నాటి నుంచి స్వాతి తన పుట్టిల్లు తిమ్మాపూర్లోనే ఉంటున్నది.
ఈ నెల 13న తిమ్మాపూర్ వచ్చిన రమేశ్.. భార్య స్వాతిని ఇంటికి వెళ్దాం రమ్మని పిలిచాడు. దానికి ఆమె అంగీకరించలేదు. మాట్లాడుకుందాం అని చెప్పి.. గ్రామ సమీపంలోని హనుమాన్ గుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో భార్య స్వాతిని చంపుతానంటూ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయబోయాడు. అటువైపు వచ్చిన గ్రామస్తులు ఈ సంగతి చూసి ఇద్దరిని విడిపించారు. భర్త రమేశ్‌పై భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ రెడ్డి చెప్పారు.