మెదక్ మున్సిపాలిటీ, జనవరి 2: మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ తరువాత తొలి ఆదివారంతో పాటు నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో రాష్ట్ర నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్టాటకల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. భక్తులు ప్రార్థనల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా చర్చి ఇన్చార్జి బిషప్ రెవరెండ్ పద్మారావు భక్తులనుద్దేశించి దైవసందేశం చేశారు.
చర్చిలో ఆలపించిన యేసయ్య భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రార్థనల్లో చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి శాంతయ్య పాస్టర్లు డేవిడ్, శ్రీనివాస్, జైపాల్, సువర్ణతో పాటు చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, జయరాజు సంశాన్ సందీప్, సువణ్డగ్లస్, ప్రాంక్జాన్సన్, ప్రభుదాస్, దేవరాజ్, లిల్లీగ్రేస్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు చర్చిలోని వసతి గృహాల వద్ద, చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల తరువాత చర్చిలో ఇన్చార్జి బిషప్ రెవరెండ్ పద్మారావు నేతృత్వంలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.