కంది, జనవరి 10: సంగారెడ్డి జిల్లా కంది మం డలం చిద్రుప్ప గ్రామ శివారులో కొనసాగుతున్న అక్రమ వెంచర్ పనులను శుక్రవారం అధికారులు అడ్డుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న కంది మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నారు. వ్యాపారులు సాగు భూములను గుంటల చొప్పున కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి ఫాం ల్యాండ్ పేరిట విక్రయిస్తున్నారు. నాలా పన్ను చెల్లించి, హెచ్ఎండీఏ నుంచి లేఅవుట్ అనుమతులు పొందిన తర్వాతే విక్రయాలు జరపాలి.
కానీ, అలా కాకుండానే వ్యాపారులు ఆకర్షణీయ ప్రకటనలతో కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కంది ఎంపీవో మహేందర్‌రెడ్డి వెంచర్‌ను పరిశీలించి పనులను అడ్డుకోవడంతోపాటు ప్రకటనల బో ర్డులను తొలిగించారు. అన్ని అనుమతులు పొందిన తర్వాతే పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తిగా తెలుసుకున్న తర్వాతే కొనుగోలుదారులు ముందుకు రావాలని, ఇందులో ఏమైనా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామన్నారు.