నర్సాపూర్, ఫిబ్రవరి 11: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పోలింగ్ వాడీవేడిగా జరిగింది. ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవల మధ్య పోలింగ్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపల్ ఎన్నికలు ఘర్షణలు, దాడులకు దారితీశాయి. బీఆర్ఎస్ హయాంలో పార్టీల మధ్య ఎలాం టి గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగాయి.
ఓటర్లు సైతం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం జరిగిన రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల మధ్య భయానకరమైన వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి 4, 5, 10, 11 వార్డుల్లో పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు, దాడులు జరిగాయి. రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
ఐదో వార్డులో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఘర్షణకు దిగారు. బుధవారం ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా 15వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి భర్త భిక్షపతి, కార్యకర్తలపై అదే వార్డుకు చెందిన బీజేపీ అభ్యర్థి అనుచరులు దాడి చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి గొడవలు చూడలేదని, ఈఎన్నికలు భయాన్ని కలిగించాయని పట్టణవాసులు వాపోయారు.