పటాన్చెరు/ పటాన్చెరు రూరల్, జూలై 4: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నేతృత్వంలో హైలెవల్ కమిటీ సందర్శించింది. సీఎస్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల హైలెవల్ కమిటీ పరిశ్రమలో దర్యాప్తు చేపట్టింది. అనంతరం ‘ఐలా’ భవనం వద్ద బాధిత కార్మిక కుటుంబాలను బృందం కలిసింది. ఈ సందర్భంగా సీఎస్‌కు నిరసన సెగ తగిలింది. సిగాచిలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన సీనియర్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ డిపార్టుమెంట్ ఉద్యోగి సిల్వరి రవి జాడ ఐదు రోజులుగా కనబడక పోవడంతో వారి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
ఐదు రోజులుగా పడిగాపులు పడుతున్నా, ఇంతవరకు మనిషి జాడ చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా సోదరుడి మృతదేహాన్ని అయినా అప్పగించాలని అతడి సోదరుడు సీఎస్‌ను కోరాడు. అడ్డమైన కంపెనీలకు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారని మరికొందరు ప్రశ్నించారు. మావారి మృతదేహాలను ఎప్పుడు చూపిస్తారని బాధిత కుటుంబాలు మండిపడ్డాయి. స్పందించిన సీఎస్.. ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం తనకు బాధగా ఉందన్నారు.
ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని, అందుకే కొంత జాప్యం జరుగుతున్నట్లు సీఎస్ తెలిపారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి సీఎస్ బయటకు రాగానే వెనుక నుంచి వస్తున్న సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య కాళ్లపై ఒడిశా నుంచి వచ్చిన బాధిత కుటుంబం పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారిని పక్కకు జరిపించారు. హెల్ప్‌డెస్క్ కేంద్రంలో ఐదు రోజులుగా తమవారి కోసం పడిగాపులు పడుతున్నవారు, తమవారి శవమైన ఇస్తే వెళ్లిపోతామని దయనీయంగా అడగడం అందరినీ కలిచివేసింది.
సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో భారీ సంఖ్యలో కార్మికులు మృతిచెందడంతో సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిగాచి పరిశ్రమను శుక్రవారం సందర్శించి ప్రమాద స్థలిని క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రమాద సమయం, కార్మికుల సంఖ్య, పేలుడు జరగడానికి గల కారణాలు ఆరాతీసింది. అనంతరం స్పెషల్ సెక్రటరీ రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అరవింద్ కుమార్, పరిశ్రమలు, కార్మిక శాఖ స్పెషల్ సెక్రటరీ దాన కిశోర్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశ్రమలో పర్యటించారు.
పరిశ్రమలో అగ్నిమాపకశాఖ, పొల్యూషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, పరిశ్రమల శాఖ సిబ్బంది, కంపెనీ ప్రతినిధులతో, పోలీసులు, రెవెన్యూ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిశ్రమ భద్రతా ప్రమాణాలు, సేఫ్టీ మెకానిజం నిర్వహణపై సంబంధిత శాఖలతో ఆయన మాట్లాడారు. పరిశ్రమలో రియాక్టర్లు, డ్రయ్యర్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టం, ఉద్యోగుల రక్షణ మార్గాలు, ఇతర భద్రతా అంశాలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులు, పరిశ్రమ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ తెలిపారు.
పాశమైలారం ‘ఐలా’ కార్యాలయం వద్ద ఐదు రోజులుగా అధికారులు హెల్ప్‌డెస్క్ నిర్వహిస్తున్నారు. యూపీ, బీహారు, అస్సాం, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చిన మృతుల కుటుంబీకులకు అక్కడే తాత్కాలిక బస వసతి కల్పించారు. బాధిత కుటుంబసభ్యులను శుక్రవారం సీఎస్ రామకృష్ణారావు కలిసి ఓదార్చారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ యంత్రాంగంపై నిరసన వ్యక్తం చేశారు. తమ వారిని ఎప్పుడు చూపిస్తారని కొందరు, తమవారి ఆచూకీ ఎలాగు దొరకట్లేదు, కనీసం శవాలనైనా అప్పగించాలని వేడుకున్నారు. అడ్డమైన కంపెనీలకు ఎలా పర్మిషన్లు ఇచ్చారని కొందరు, మావారి బాడీలకు ఎన్నిరోజులకు ఇస్తారని మరికొందరు ప్రశ్నించారు. ఐదు రోజులుగా ఇక్కడ పడిగాపులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్నాపూర్‌కు చెందిన సిల్వరి రవి సోదరుడు ఆచూకీ ఇవ్వలేని పక్షంలో బాడీనైన ఇవ్వాలని ఆవేదనతో సీఎస్‌ను కోరాడు.