మెదక్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో బుధ, గురువారం భారీగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు భారీగా కురిసిన వానకు మెదక్ జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని పెద్దవాగులన్నీ ఉప్పొంగుతున్నాయి. పాపన్నపేట మండలంలోని ఘనపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతుండగా, మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.
జిల్లాలో అనేక చోట్ల కాల్వలు తెగిపోయి పంటలకు నష్టం వాటిల్లింది. హవేళీఘనపూర్ మండలంలో వాగులు, చెరువులు కొట్టుకుపోయాయి. మండలంలోని నకవాగు పొంగడంతో కామారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన నరేందర్‌గౌడ్ అనే వ్యక్తి కారుతో సహా వరదలో కొట్టుకుపోయాడు. చాకచక్యంగా కారులో నుంచి బయటపడి చెట్టును పట్టుకొని ఉన్న నరేందర్‌గౌడ్‌ను, ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా కాపాడింది. హవేళీఘనపూర్ మండలం రాజ్పేటలో వరదలో చికుకొని యాదాగౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. నిజాంపేట మండలం నందిగామలోని సాయి చెరువు పకన గల ఫౌల్టీ ఫాంలో 10వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.
రేగోడ్ మండలం మర్పల్లిలో బండి హరికృష్ణ(22) అనే వ్యక్తి మంగళవారం గుండెపోటుతో మరణించగా, బుధవారం అంత్యక్రియలు నిర్వర్తించడానికి వెళ్లగా వరదకు గొల్ల వాగు దాటడానికి వీలులేకపోవడంతో జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. వాగుపై బ్రిడ్జి లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. మెదక్-శమ్నాపూర్ వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. పెద్దశంకరంపేట మండలం టింకటిలోని పాత బురుజు కూలింది.
రేగోడ్ మండలం జగిర్యాల చెరువు పొంగిపొర్లి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కౌడిపల్లిలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నశంకరంపేట శివారులో పంట పొలాలు నీట ముగినిగాయి. ఎల్లాపూర్ వంతెన పొంగిపొర్లడంతో మెదక్-బొడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ కలెక్టరేట్లో అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 93919 42254 ఏర్పాటు చేశారు.
ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, యంత్రాంగం సూచనలు సలహాలు పాటించాలని కోరారు. ముంపునకు గురైయ్యే ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. జలాశయాలు నిండు కుండలా ఉన్నాయని, ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై జిల్లా ప్రత్యేకాధికారి హరీశ్ మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్‌రాజ్, ఇతర అధికారులతో సమీక్షించారు.
వరద బాధితులను ఆదుకుంటాం : మంత్రి గడ్డం వివేక్
వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుం టామని, సహాయక చర్యలకు మెదక్ జిల్లాకు కోటి రూపాయలు మంజూరు చేశామని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ప్రత్యేకాధి కారి డాక్టర్ హరీశ్, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, ఇతర శాఖల అధికా రులతో సహాయక చర్యలపై ఆయన సమీక్షిం చారు. 40 ఏండ్లలో ఇంత భారీవర్షం మెదక్ జిల్లాలో కురవలేదన్నారు. అనంతరం ఇన్ చార్జి మంత్రి వివేక్ హవేళీఘన్‌పూర్ మండ లం లింగ్సాన్‌పల్లి తండా వెళ్లే దారి, తిమ్మా యపల్లి వెళ్లే మార్గంలోని బ్రిడ్జి తిమ్మాయపల్లి వెళ్లే మార్గంలోని బ్రిడ్జిని, బూరుగుపల్లి రోడ్డును పరిశీలించారు.