హుస్నాబాద్, జూలై 19: కొన్ని రోజులుగా కనుమరుగైన వరుణుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. హుస్నాబాద్ పట్టణంతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటలకుపైగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యా యి. దుకాణాలు, ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, అండర్‌గ్రౌండ్ నిర్మాణాల్లో భారీగా నీరు చేరింది. ఇండ్లు, దుకాణాల్లో నీరు చేరడంతో తీవ్ర నష్టం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌లో వర్షపు నీరు చేసి చిన్నపాటి చెరువును తలపించింది.
శనివారం ఉదయం వరకు కూడా నీళ్లు అలాగే ఉండటంతో మోకాలి లోతు నీళ్ల నుంచే బస్సుల రాకపోకలు కొనసాగాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం ఆగిన అనంతరం అర్ధరాత్రి సమయంలో స్థానికంగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మెయిన్‌రోడ్డులో వరద పరిస్థితులు, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలిం చారు. మంత్రి వెంట మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ఉన్నారు. వర్షపు నీటి తొలిగింపు కోసం అగ్నిమాపక సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఒక్క రోజే 44.7సె.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బెజ్జంకి మండలంలో 11.8 మి.మీటర్లు, కోహెడలో 77.0మి. మీటర్లు, హుస్నాబాద్‌లో 63.4మి.మీటర్లు, అక్కన్నపేటలో 13.6మి.మీటర్లు, మద్దూరులో 18.4మి.మీటర్లు, ధూళిమిట్ట మండలంలో 84.2మి.మీటర్ల వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే భారీ వర్షం కావడం విశేషం. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
స్తంభించిన జనజీవనం
రామాయంపేట, జూలై 19: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఒక్కసారిగా వర్షం రావడంతో జనజీవనం స్తంభించింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలు వర్షం కురిసింది.ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీ వర్షానికి పాత జాతీయ రహదారిపై వరద నిలిచిపోయింది. కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి.
నర్సాపూర్ మున్సిపాలిటీలో…
నర్సాపూర్,జూలై19: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో శనివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కొన్ని కాలనీల్లోకి వరద వచ్చి చేరింది. బస్టాండ్ సమీపంలోని విఘ్నేశ్వరకాలనీలోకి వరద పోటెత్తడంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.ఖాజీగల్లిలోని ఓ ఇంట్లోకి వరద చేరింది.
నిండిన చెరువులు, కుంటలు
పుల్కల్, జూలై 19 : సంగారెడ్డి జిల్లా పుల్కల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. దీంతో చెరువులు,కుంటలు నిండి కళక ళాలాడుతున్నాయి. పుల్కల్లోని చిట్టారెడ్డి చెరువు రాత్రికి రాత్రే నిండిపోయింది. ఊరిపెద్దచెరువు,కుంటలు నిండిపోయాయి. మండల పరిధిలోని ముద్దాయిపేట, పోచా రం,సింగూరు,బస్వాపూర్,మంతూర్,మిన్పూర్,ఇసోజిపేట,కోడూరు గ్రామాల్లో పత్తి పంటలు భారీ వర్షానికి నీట మునిగాయి. మండలంలోనే అత్యధికంగా 112 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.