అందోల్, ఫిబ్రవరి 18 : సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కలెక్టర్, కమిషనర్…సాక్షాత్తు ఆరోగ్యశాఖ మంత్రి వచ్చినా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంలేదు. విధుల్లో వారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు చర్యలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో తెలియడం లేదు. గత నెలలో కలెక్టర్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ దవాఖానను సందర్శించి హెచ్చరించినా వైద్యుల్లో మార్పు రావడం లేదు. సోమవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట ఏరియా దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆ సమస్యంలో సై తం వైద్యులు అందుబాటులో లేరు. దీనిని బట్టి చూస్తుంటే విధుల్లో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తుంది. సోమవారం మంత్రి దవాఖానకు వచ్చిన సమయంలో వైద్యులు వ్వరూ అందుబాటులో లేరు. కేవలం జూనియర్ వైద్యుడు సతీశ్ గౌడ్ ఒక్కడే విధుల్లో ఉండడంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీరుపై మంత్రి ఆగ్ర హం వ్యక్తం చేశారు. అనంతరం దవాఖానలో రికార్డులు పరిశీలించి, వార్డుల్లో తిరిగి రోగులు, వారి సహాయకులతో మంత్రి మాట్లాడారు. వైద్యసేవలు అందుతున్న తీరు, వసతులపై ఆరాతీశారు.
సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి వైద్యుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు హెచ్చరించిన తీరుమారదా..? దవాఖానలో పరిస్థితి ఇలా ఉంటే, మీరందరు ఏం చేస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు. వెంటనే పరిస్థితి చక్కదిద్దాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆవేశించారు. మంత్రి ఆదేశాలతో మంగళవారం దవాఖాన తనిఖీకి వచ్చిన డీసీహెచ్ఎస్ డాక్టర్ షరీఫ్, ఏదో వచ్చామా..? వెళ్లామా..? అన్నట్లు తనిఖీచేసి వెళ్లారు.
తనిఖీకి వచ్చిన డీసీహెచ్ఎస్ ఆనవాయితీ ప్రకారం పలువార్డులు తిరిగి, రికార్డులు పరిశీలించి వెళ్లారు. ఆయన దవాఖానకు తనిఖీకి వచ్చే విషయం ముందుగానే తెలిసి వైద్యులు, సిబ్బంది జాగ్రత్తలు పడ్డారని తెలిసింది. వైద్యులు, వైద్యసిబ్బంది అండర్ స్టాండింగ్‌తో పనిచేస్తున్నారని, దీంతో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.