పాపన్నపేట : హరితహారం కార్యక్రమం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మానస పుత్రిక. ఇప్పుడు ఆ హరితహారం మొక్కలను నరికేస్తూ కొందరు ప్రకృతి పచ్చదనాన్ని ఎండమావిగా మారుస్తున్నారు. పెద్దపెద్ద వృక్షాలుగా మారిన చెట్లను ఎక్కడికక్కడ నిర్దాక్షిణంగా నరికేస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా బొడ్మెట్పల్లి రహదారిపైగల మండల కేంద్రమైన పాపన్నపేట మెయిన్ రోడ్డు వెంట బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నాటిన చెట్లను విద్యుత్ శాఖ అధికారులు నరికేస్తున్నారు. విద్యుత్ వైర్లకు అడ్డువస్తున్నాయంటూ చెట్లను తొలగిస్తున్నారు. స్థానికంగా వేస్తున్న పెట్రోల్ పంపు ఎక్స్ ప్రెస్ లైన్ కోపం వాటిని నరికేశారు.
పెట్రోల్ పంప్ యాజమాన్యం ఎంతో కొంత ఇస్తుందన్న ఉద్దేశంతో సంబంధిత అధికారులు అత్యుత్సాహంతో చెట్లను తొలగించారు. నిజానికి హరితహారం మొక్కలను తప్పిస్తూ ఆ విద్యుత్ లైన్ను తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున పెరిగిన చెట్లను నరికేశారు. దాంతో చెట్లను నరికిన వారిపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.