సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 12 : ఆరునెలల నుంచి మెస్‌చార్జీలు రాక వార్డెన్లు అప్పులు తెచ్చి హాస్టళ్లు నడిపించే పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ పాలనలో సంక్షేమ హాస్ట ళ్లు ఆగమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మెస్‌చార్జీలు రాకపోతే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా అందుతుందని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలోని సమీకృత బాలుర వసతి గృహాన్ని గురువారం హరీశ్‌రావు ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ మెనూ ప్రకారం సరైన భోజనం పెడుతున్నారా లేదా, దుప్పట్లు, ప్లేట్లు, షూస్ వంటివి ఇచ్చారా అని ఆరాతీశారు. తమకున్న పలు సమస్యలను విద్యార్థులు హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. హాస్టల్ వార్డెన్, సిబ్బందితో మాట్లాడి సమస్య లు అడిగి తెలుసుకున్నారు. 8 నెలల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రావట్లేదని, 6 నెలల నుంచి మెస్‌చార్జీలు రావట్లేదని, అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నామని సిబ్బంది హరీశ్‌రావు దృష్టికి తెచ్చారు. ట్యూటర్లకు సైతం సమయానికి జీతాలు రావట్లేదన్నారు. హాస్టల్ మెయింటెన్స్ ఫం డ్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భోజనశాలలో బియ్యం, తదితర సామగ్రిని పరిశీలించి, విద్యార్థులతో కలిసి హరీశ్‌రావు భోజనం చేశారు.
నాడు ఎవరెస్ట్ అంత ఖ్యాతి..
మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ ఏడాది పాలనలో హాస్టళ్లు ఆగమై పోయినట్లు తెలిపారు. విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యార్థుల ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున నిలబెట్టారన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలల నుంచి మెస్‌చార్జీల చెల్లింపు జరగలేదన్నారు. ఈ ఒక్క హాస్టల్లోనే దాదాపు రూ.9,50,000 మెస్‌చార్జీలు క్లియరెన్స్ కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. హాస్టల్ వార్డెన్లు ఉద్దెర తెచ్చి, అప్పులు తెచ్చి, బంగారం కుదవ పెట్టి విద్యార్థులకు భోజనం పెడుతున్నారని చెప్పారు. పిల్లల ఆరోగ్యం బాగాలేకపోతే వార్డెన్లు, ఉపాధ్యాయులను శిక్షిస్తా అంటున్నావు.. కానీ, శిక్ష వేయాల్సింది ప్రభుత్వానికి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టవల్స్, ప్లేట్లు, గ్లాస్లు, షూస్ రాలేదని విద్యార్థులు వాపోతున్నారని.. హాస్టళ్లలో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. కొన్ని హాస్టల్లో వేడి నీళ్లు రాక విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కామాటిలకు, వాచ్మెన్లకు 8 నెలల నుంచి జీతాలు రాకపోతే వారు ఎలా పని చేస్తారని, వారి కుటుంబాలు ఎలా నడవాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఇచ్చే కాస్మోటిక్ ఛార్జీలు, వాషింగ్ ఛార్జీలు కూడా రావడం లేదన్నారు. చాలా ప్రాంతాల్లో ఎస్సీ గురుకుల పాఠశాలకు కిరాయిలు ఇచ్చే పరిస్థితి లేదని, వాటికి తాళాలు వేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. తప్పు ప్రభుత్వం దగ్గర ఉందని, ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెట్టాలన్నారు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోతే ఉద్యోగులు ఏం చేస్తారన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో వండుతున్నది కొత్త బియ్యమని.. అన్నం ముద్దగా అయ్యే పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాత సన్న బియ్యం పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ హాస్టల్లపై ఆజమాయిషీ పోయిందని, పట్టించుకునే వారు లేరన్నారు. వెంటనే మెస్‌చార్జీలు విడుదల చేయడంతో పాటు కాస్మోటిక్, ఇతర బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మాజీ సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ ఏఎంసీలు చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.