సిద్దిపేట, ఏప్రిల్ 25: తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు బాసటగా నిలిచారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన ‘భద్రంగా ఉండండి.. భవిష్యత్తులో ఎదగాలి’ అనే కార్యక్రమంలో సిద్దిపేట పట్టణానికి చెందిన నాగరాజు-విజయ దంపతుల కూతు రు సాత్విక హాజరయ్యారు. స్వాతిక స్ప్రింగ్ డాల్ సూల్లో ఏడో తరగతి చదువుతున్నది. తండ్రిని కోల్పోయిన చిన్నారి సాత్విక ఈ కార్యక్రమంలో అమ్మానాన్నల గురించి వివరించే సమయంలో నాకు నాన్న లేడు…. నేను అమ్మను ఇబ్బంది పెడుతున్నా అని ఏడుస్తూ తన ఆవేదనను వెళ్లబుచ్చింది.
దీంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు చలించి భావోద్వేగానికి గురయ్యారు. అదేరోజు చిన్నారి సాత్వికకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. ఈనెల 25న క్యాంపు కార్యాలయంలో టిఫిన్‌కు రావాలని సాత్విక తల్లిని ఎమ్మెల్యే హరీశ్ రావు ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇచ్చిన ఇచ్చిన మాటప్రకారం శుక్రవారం చిన్నారి సాత్వికతో పాటు తన తల్లి విజయను క్యాంపు కార్యాలయం పిలిపించుకొని వారితో భోజ నం చేశారు. తన మిత్రుని సహాయంతో హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త తిరుమలరెడ్డి చిన్నారి విషయం తెలుసుకొని చిన్నారికి అండగా రూ. 2 లక్షల చెకును హరీశ్‌రావు చేతుల మీదుగా అందజేశారు.
క్యాంపు కార్యాలయంలో చిన్నారి సాత్వికతో ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆప్యాయంగా మాట్లాడారు. మళ్లీ అమ్మను ఇబ్బంది పెడుతున్నావా.. ఇబ్బంది పెట్టొద్దు. అమ్మ ప్రేమ చాలా గొప్పది. నీవు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించినప్పుడు అమ్మకు ఎంతో ఆనందంగా ఉంటుంది.. నీవు అమ్మకిచ్చే గొప్ప బహుమానం అదే అని అన్నారు. భవిష్యత్తులో చదువుతో పాటు ఇతర ఏ ఇబ్బందులున్నా తాను అండగా ఉంటానని హరీశ్‌రావు భరోసానిచ్చారు.