దుబ్బాక, మే 17: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి, శత్రువులతో పోరాటం చేస్తుంటే.. స్వగ్రామంలో తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమికి రక్షణ లేకుండా పోయిందని సోషల్ మీడియాలో ఓ జవాన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఆ జవాన్ భూసమస్య పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఫోన్లో హరీశ్‌రావు కోరారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లికి చెందిన ఆర్మీ సైనికుడు బూరు రామస్వామి కశ్మీరు సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు.
శనివారం ఉదయం జవాన్ రామస్వామి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. తమ ప్రాణాలకు తెగించి శత్రుదేశం పాకిస్థాన్‌తో జరుగుతున్న యుద్ధంలో కశ్మీర్లో విధులు నిర్వహిస్తుంటే, మరోపక్క తన స్వగ్రామంలో తన కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని ఓ రెవెన్యూ అధికారి అక్రమంగా కబ్జా చేసి, తప్పుడు రికార్డులు సృష్టించాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో తన తండ్రి వెంకటయ్య సాదాబైనామా ద్వారా 1.16 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఆ భూమిని తమ గ్రామానికి చెందిన వీఆర్వో రమేశ్, అతడి సోదరుడు కలిసి రికార్డుల్లో లేకుండా చేశారని ఆరోపించాడు. ఆ భూమి విషయంలో తమ తల్లిదండ్రులు శామవ్వా ,వెంకటయ్యను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపాడు.
ఈ విషయంపై తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ దృష్టికీ తీసుకెళ్లినా న్యాయం జరగలేదని వాపోయాడు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమంలో వీడియోను పోస్టు చేస్తున్నట్లు జవాన్ తెలిపాడు. ఈ వీడియో సీఎం దృష్టికీ వెళ్లేంతవరకు వైరల్ చేయాలని కోరాడు. ఈ వీడియోను చూసిన మాజీమంత్రి హరీశ్‌రావు స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్ మనుచౌదరితో ఫోన్లో మాట్లాడి, సైనికుడి కుటుంబానికి చెందిన భూసమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అక్బర్పేట-భూంపల్లి తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి చౌదర్పల్లిలో సైనికుడి కుటుంబానికి చెందిన భూమిని పరిశీలించారు.
సైనికుడు రామస్వామి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ విషయంపై తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ… సైనికుడు తండ్రి వెంకటయ్య 35 ఏండ్ల కిందట సాదాబైనామా ద్వారా భూమి కొనుగోలు చేసినట్లు వారి వద్ద ఉన్న పత్రాలను బట్టి తెలిసిందన్నా రు. ఆ భూమి చుక్క నర్సవ్వ పేరుతో ఉన్నట్లు ధరణిలో వస్తున్నదన్నారు. దీంతో వీరి పేరిట భూమిని రికార్డులో నమోదు చేయడానికి గతంలో అవకాశం లేకుండా పోయిందన్నా రు. ఈ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి సైనికుడి కుటుంబానికి న్యాయం చేస్తామని తహసీల్దార్ తెలిపారు.