నంగునూరు, ఆగస్టు 20: రైతులకు యూరియా అందించాలని, లేకుంటే యూరియా కోసం ఉద్యమం తప్పదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని, రైతులకు కంటినిండా నిద్ర పట్టడం లేదన్నారు. ఇవాళ గ్రామాలన్నీ యూరియా కోసం ఉద్యమిస్తున్నాయని తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి నుంచి కేసీఆర్ ప్రభుత్వం చెప్పులకు చెక్ పెట్టి రైతుల చెంతకు యూరియా అందించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం వేస్తే, రేవంత్ ప్రభుత్వం అన్నదాతలను అధఃపాతాళానికి తొక్కిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కేసీఆర్ గోదావరి నీళ్లు తెచ్చి రైతుల కాళ్లు కడిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం పోలీసుల కాళ్లు, అధికారుల రైతుల చేత మొక్కిస్తున్నారన్నారు. ఇదేనా మీరు తెచ్చిన మార్పు అన్నా రు. ఏ చేతులైతే పోలీసుల కాళ్లు మొక్కాయో.. రేపు ఏ ఎన్నికలు పెట్టినా కాంగ్రెస్‌కు ఆ చేతులే గుణపాఠం చెబుతాయన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతున్నదని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, పంట రుణమాఫీ పేరిట రైతులను ఎంతకాలం ఉసురు పోసుకుంటారని అడిగారు. కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా రైతుబంధు తెచ్చి, రైతుబీమా, 24 గంటల కరెంట్, చెరువులు బాగు చేసి, చెక్‌డ్యామ్‌లు కట్టి వ్యవసాయాన్ని పండగ చేసింది కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా కొరత, విత్తనాల కొరత, సగం మందికే రుణమాఫీ, వడ్లు అమ్మి మూడు నెలలు అయినా.. రైతులకు రూ.1300 కోట్ల బోనస్ డబ్బులు ఇవ్వలేదన్నారు. రేవంత్‌రెడ్డి ఏదీ ఇవ్వలేదని, అన్ని ఎగ్గొట్టారన్నారు. వెంటనే బోనస్ డబ్బులు విడుదల చేయాలని, రుణమాఫీ కాని వారికి వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులకు గ్రామా ల్లో తిరిగే హక్కు లేదని, ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. రేవంత్‌రెడ్డికి ముందు చూపులేకపోవడం వల్లనే ఇవ్వాళ రైతులు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుందన్నారు. రేవంత్‌రెడ్డి ఎమర్జ్జెన్సీ పాలన తెచ్చారని, రేవంత్ నోరు విప్పితే కేసీఆర్ ను తిట్టుడు తప్ప ఏం లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, వేముల వెంకట్‌రెడ్డి, రాగుల సారయ్య, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్ గౌడ్, నాయకులు గుండు భూపేశ్, లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి పాల్గొన్నారు.