నంగునూరు, ఫిబ్రవరి 9 : నంగునూర్ మం డలం ఘణపూర్‌లో నిర్మిస్తున్న పంప్‌హౌస్ నిర్మాణ పనుల జాప్యంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదలశాఖ అధికారులు, మండల ముఖ్య నాయకులతో కలిసి ఆయన ఘణపూర్ పంప్‌హౌస్ నిర్మాణ పనులు, సాగునీటి సరఫరాపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ఇప్పటికీ విద్యుత్ సరఫరా చేయించామని, అందుకు అవసరమైన భూసేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నా పనులు ఎందుకు జరగడం లేదన్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి పంప్‌హౌస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పంప్‌హౌస్ పూర్తయితే వాగు అవతలి గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు.
ఇప్పటికే రంగనాయక సాగర్‌కుడి కాల్వ ద్వారా నీళ్లు విడుదల చేశామని, మండలంలోని కాల్వల ద్వారా అన్ని చెరువులకూ నీళ్లు చేరే విధంగా అధికారులు సమన్వయం కావాలని, నాయకులు అందు కు చొరవ చూపి రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు. సమీక్షలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎడ్ల సోంరెడ్డి, సంగు పురేందర్, ఇరిగేషన్ జేఈ రాజు, వర్క్ ఇన్స్పెక్టర్ పబ్బతి రాంరెడ్డి పాల్గొన్నారు.