సిద్దిపేట, నవంబర్ 23: ఆర్యవైశ్యుల్లోనూ ఎంతోమంది పేదలు ఉన్నారని, వారికి ఆర్యవైశ్య సంఘాలు అండగా నిలిచి తోడ్పాటు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. అన్నిరంగాల్లో సిద్దిపేటను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపామని, అదే స్ఫూర్తితో మంచి సేవలందిస్తూ సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు. అదివారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణ నూతన ఆర్యవైశ్య సంఘం కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. సేవలతోనే మనకు గుర్తింపు వస్తుందన్నారు. ఆ దిశగా నూతన కార్యవర్గం పని చేయాలని, మంచి సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారిని కూడా కలుపుకొని పోవాలని సూచించారు. నూతన కార్యవర్గం పేద వైశ్యులకు సహాయ సహకారం అందించాలన్నారు. వాసవి వివాహ వారధి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని, ఇలా మరెన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. కర్మ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మీరు చేసే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఆరవైశ్యులకు హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమలలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి,గుండు భూపేశ్, నిమ్మ రజనీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.