సిద్దిపేట, జనవరి 26 : ఉద్యోగుల సమస్యలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని పబ్లిక్ సర్వెంట్స్ భవన్లో పలువురు ఉద్యోగుల ఉద్యోగ విరమణ, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మా న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ భవన్‌తో తనకెంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిటైర్డ్మెంట్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియడం లేదని, అంతా అయోమయం నెలకొన్నదన్నారు.
వడ్డీతో సహా ఆరు వారాల్లోగా డబ్బు లు చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చిందని, కానీ, ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఉద్యోగస్తులకు ఒకటో తారీకు జీతం ఇస్తున్నామని గొప్పలు చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన 13 నెలల్లో ఒకరికి కూడా మెడికల్ బిల్లు వచ్చింది లేదన్నారు. లోన్లు వచ్చే పరిస్థితి లేదు.. పీఆర్సీ లేదు.. కేసీఆర్ హయాంలో రెండు విడతల్లో కలిపి 73శాతం పీఆర్సీ ఇచ్చి చరిత్ర సృష్టించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. నేడు పీఆర్సీ గడువు ముగిసినా దాని గురించి ప్రస్తావన లేదన్నారు. డీఏల గురించి మాట్లాడే పరిస్థితి లేదన్నారు.
లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ, రూ. 40 వేల కోట్లతో మెట్రో రైలు అభివృద్ధి చేస్తామంటున్నారని, కానీ, రూ. వేల కోట్లతో ఫోర్త్ సిటీ కడుతాం.. ఇవన్నంటికీ డబ్బులు ఉంటా యి కానీ.. ఉద్యోగులకు డీఏలకు ఎందుకు డబ్బులు లేవు..? రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి చేతులు ఎందుకు రావడం లేదని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. బెన్ఫిట్ డబ్బులు రావాలంటే ప్రభుత్వానికి 8శాతం లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో… పదేళ్ల తెలంగాణ పాలనలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదన్నారు. గతంలోనే పీఆర్సీ కమిషన్‌ను కేసీఆర్ వేశారన్నారు. 5 శాతం ఐఆర్ ఇచ్చారన్నారు. కేసీఆర్ ఉద్యోగులకు మంచి గౌరవం ఇచ్చారన్నారు.
ఈ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటీవల ఒక మంత్రి కరీంనగర్లో మహిళా కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించారో చూశామన్నారు. ఉద్యోగస్తులను అవమానపరిచే ప్రభుత్వం కాంగ్రెస్‌ది అన్నారు. 9 వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారని, వారిలో ఒక్కరికి కూడా పెన్షన్ బెన్ఫిట్లు ఇవ్వడం లేదన్నారు. పెన్షన్ బెన్ఫిట్లు తప్పించుకోవడానికి ప్రభుత్వం 65 ఏండ్లకు ఉద్యోగ విరమణ వయసు పెంచుతామని కొత్త నాటకానికి తెరలేపిందన్నారు. కేసీఆర్ అప్పట్లో అలవెన్స్ ఇచ్చారన్నారు. నేడు ఎంపీడీవోలు, తహసీల్దార్లు వెహికల్ అలవెన్స్ ఎస్సైలకు స్టేషన్ అలవెన్స్ వస్తలేవన్నారు. సిద్దిపేటపై ప్రభుత్వం పగబట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు.
సిద్దిపేట ఉద్యోగస్తులకు వేతనం లాస్ట్‌కు వేస్తున్నదరని ఆరోపించారు. సిద్దిపేటకు వెటర్నరీ కళాశాల కొడంగల్‌కు పట్టుకెళ్లారన్నారు. సిద్దిపేటలో రెసిడెన్సియల్ మహిళా డిగ్రీ కళాశాలకు రూ.17 కోట్లు మంజూరు చేస్తే మెట్టుపల్లికి తీసుకెళ్లారని, రంగనాయకసాగర్‌లో టూరిజం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తే రూ, 20కోట్ల పని జరిగాక రూ. 80కోట్లు రద్దు చేశారన్నారు. కోమటి చెరువు వద్ద శిల్పారామం పనులు బంద్ చేసి మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారని హరీశ్‌రావు విమర్శించారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు గ్యాదరి పరమేశ్వర్, విక్రమ్‌రెడ్డి, పబ్లిక్ సర్వెంట్స్ భవన్ బాధ్యులు అయిత అంజయ్య, కల్లెపల్లి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.