జహీరాబాద్, అక్టోబర్ 6: దూరదృష్టితో కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల కళాశాలలు విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బూచినెల్లి గ్రామ శివారులో ఆధునిక వసతులతో (2012) నిర్మించిన (త్రీమ్స్) మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను అప్ప ట్లో తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఝరాసంగం మండలం బోప్పన్పల్లికి చెందిన ఫిర్దోస్ అనే విద్యార్థిని ఫ్యూచర్లో ఏం అవుతావు అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అందుకు డాక్టర్ అవుతా అని సమాధానం చెప్పింది. అప్పుడు హరీశ్‌రావు చెప్పిన మాట ప్రకారమే ఫిర్దోస్ కష్టపడి చదువుకుని సిద్దిపేట జిల్లాలోని సురభీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, బీఆర్ఎస్ మండల నాయకులు, తల్లిదండ్రులతో సోమవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నివాసంలో ఆయన్ను కలువగా శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఆనాడు అడిగిన ప్రశ్నకు కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్‌లో డాక్టర్‌గా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తూ ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల, కళాశాలలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఆయా కళాశాలల్లో నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం వల్ల విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించగలుతున్నారన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 290 గురుకులాలు ఉంటే, కేసీఆర్ ప్రభుత్వ పాలనలో 1020కు చేరాయన్నారు.
కేసీఆర్ పాలనలో అన్ని గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసి ఉన్నత విద్య అందించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. దేశంలోనే రెసిడెన్షియల్ లా కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత గులాబీ అధినేత కేసీఆర్‌కే దక్కిందన్నారు. పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని అల్గోల్, బూచినెల్లి మైనార్టీ గురుకుల కళాశాలలకు చెందిన 16 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఝరాసంగం మండల అధ్యక్షుడు వెంకటేశం, నాయకులు నాగన్న, నర్సింహగౌడ్, చంద్రకాంత్ పాల్గొన్నారు.