సిద్దిపేట, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం హరీశ్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్యరావు, సునీతాలక్షారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్‌రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 17 మున్సిపాలిటీలకు సంబంధించిన ఇన్చార్జిలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. పల్లెల నుంచి పట్నం దాకా అంతా అస్తవ్యస్తమే.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచిన మున్సిపాలిటీలు నేడు నిర్వహణ లేక కళతప్పాయన్నారు. కనీసం వీధిలైట్లు వేయలేని, మురుగు కాల్వలు శుభ్రం చేయలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీల రూపురేఖలే మారిపోయాయన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆ నిధులతోనే ప్రతి మున్సిపాలిటీలో వైకుంఠధామాలు, వెజ్-నాన్ వెజ్ మారెట్లు, డంపింగ్ యార్డులు నిర్మించుకున్నామన్నారు.
పారిశుధ్యం కోసం కొత్త వాహనాలు కొని పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. కానీ, నేడు ప్రభుత్వం నిధులు ఇవ్వక, ఉన్నవాటిని నిర్వహించలేక పట్టణాలను గాలికొదిలేసిందన్నారు. కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించామని కానీ, నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం నీటి సరఫరా చేయడం లేదన్నారు. డ్రైనేజీల నిర్వహణ, పారిశుధ్యం వంటి కనీస అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4000 పింఛన్, మహిళలకు రూ. 2500, విద్యార్థులకు భరోసా ఇస్తామని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తుంగలో తొకిందన్నారు.
ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరును ఎకడికకడ ఎండగట్టాలన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలుపొందారని, అదే ఉత్సాహంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లాలని.. నాడు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, నేడు కాం గ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17కు 17 మున్సిపాలిటీల్లో తిరిగి గులాబీ జెండా రెపరెపలాడించాలని ఆయన పిలుపునిచ్చారు.