సిద్దిపేట అర్బన్, జనవరి 10 : అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గం పదో తరగతి ఫలితాల్లోనూ ఆదర్శంగా నిలవాలన్నదే తన తాపత్రయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పిల్లలను ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో మీ పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారని, వారికి ఇది అత్యంత కీలకమైన ఘట్టం అన్నారు.
మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుందన్నారు. లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి, పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదన్నారు. తల్లిదండ్రులుగా మీ పిల్లలు పరీక్షలు రాసే ముందు మీరు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వార్షిక పరీక్షలు ముగిసేదాకా పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సెల్ఫోన్లకు దూరంగా ఉంచడంతో పాటు విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడాలన్నారు. మీ ఇంటికి సంబంధించిన పనులు, వ్యవసాయ పనులు వారికి చెప్పవద్దని హరీశ్‌రావు కోరారు.
ఈ పోటీ ప్రపంచంలో సాదాసీదాగా కాకుండా ప్రతిభను చాటితేనే మంచి అవకాశాలు వస్తాయని, మీ ఆశలకు, మీ పిల్లల ఆశయాలకు మధ్య వారధిగా తాను నిలబడడానికి కృషి చేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. నాలుగేండ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలో పదో తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తున్నట్లు తెలిపారు. నూటికి నూరుశాతం పాసవుతూ..ప్రతిష్టాత్మకమైన బాస ర ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలోనూ 169 మంది నియోజకవర్గ విద్యార్థులు గతేడాది సీట్లు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఉచిత ఇంజినీరింగ్ విద్యతోపాటు మంచి ఉద్యోగాలను దక్కించుకున్నట్లు గుర్తుచేశారు. మీ పిల్లలు మంచి మా ర్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నదే తన ఆకాంక్ష, తపన అని, తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నానని, జిల్లా విద్యాధికారి నుంచి మీ పిల్లలకు చదువు చెప్పే హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో సమీక్షలు నిర్వహిస్తానని హరీశ్‌రావు చెప్పారు.
వారి స్కూళ్లలో సౌకర్యాలు కల్పించామని, ఒక్క మార్కు తగ్గకుండా డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రతి సబ్జెక్ట్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రజాప్రతినిధిగా, మీ కుటుంబంలో ఒకడిగా తనవంతు ప్రయత్నం తాను చేస్తున్నానని, మీరు కూడా మీ పిల్లలను బాగా చదివించాలన్నారు. చదువుతో పాటు చక్కని చేతిరాత ఉండేలా చూడాలన్నారు. ఇక మీ పిల్లల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సిద్దిపేట నియోజకవర్గ పదో తరగతి విద్యార్థుల ప్రిపరేషన్‌పై డీఈవో, ఎంఈవోలు, హెచ్ఎంలతో మాజీ మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఐదేండ్ల నుంచి జిల్లాలో అగ్రస్థానం లో నిలిచిందని, గతేడాది సిద్దిపేట నియోజకవర్గం 99శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది మీ కృషి ఫలితమని, మీ సమిష్టి కృషికి, సమన్వయ చొరవకు అభినందనలు తెలిపారు.
ఇదే స్ఫూర్తి, అదే పంథాతో ముం దుకు వెళ్దామన్నారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు మీ ద్వారా ఉత్తరాలు పంపామని, చేరినాయని కూడా తెల్సిందన్నారు. త్వరలోనే పాఠశాల వారీగా సమీక్ష నిర్వహిస్తానని, డల్‌గా ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ్ద, దృష్టి పెట్టాలన్నారు. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు త్వరలోనే స్నాక్స్ ఏర్పా టు చేస్తానని, ప్రతి పదిమంది విద్యార్థికి ఒక టీచ ర్ను ఏర్పాటు చేస్తామన్నారు. టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకోవాలని, వారిని ఇంటికి వెళ్లి చదివిపించడం,
వారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ఉదయం లేపడం, టీవీలు, ఫోన్లకు దూరంగా ఉంచడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. ఏ సబ్జెక్ట్‌లో విద్యార్థి వీక్‌గా ఉన్నాడో గుర్తించి వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. వచ్చే రెండు నెలలపాటు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సిద్దిపేట నియోజకవర్గం మంచి ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని హరీశ్‌రావు సూచించారు.