మెదక్ మున్సిపాలిటీ, మార్చి 25: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ప్రతి రంజాన్‌కు పేద ముస్లింలకు చీరెలు, బట్టలతో కూడిన తోఫా అందజేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తోఫాలు మాయమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ జిల్లాకేంద్రంలోని క్రిస్టల్ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు భారీసంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆరుగ్యారెంటీలు అటకెక్కినట్లు విమర్శించారు. కేసీఆర్ సాబ్ దిల్వాలే ముఖ్యమంత్రి ఉండే అని, రంజాన్ తోఫా ఇచ్చేవారని, కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత ఇవ్వడం లేదని అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారని హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు ప్రభుత్వం ఏమి చేసింది లేదని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీల కోసం మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చి అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ ఎంతగానో కృషిచేశారని, వారికి కీలక పదవులు ఇచ్చి గౌరవించారన్నారు. ప్రతి రంజాన్‌కు మెదక్‌కు రావడం తనకెంతో సంతోషాన్ని ఇస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో మెదక్, తూప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, రవీందర్‌గౌడ్, జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఆంజనేయులు, కృష్ణారెడ్డి, సోహేల్, శ్రీనివాస్, సలాం, గౌష్‌ఖురేషి, బీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, లింగారెడ్డి, బాబుల్‌రెడ్డి, ప్రభురెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, బాల్‌రెడ్డి, జుబేర్, ఫాజిల్, మహమ్మద్, అజ్గర్‌అలీ పాల్గొన్నారు.