పటాన్చెరు, జూన్ 21: రైతు భరోసా డబ్బులు ఇవ్వకుంటే ఓఆర్ఆర్ను దిగ్బంధం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పటాన్చెరు నియోజకవర్గంలో 22వేల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. 22 వేల మంది రైతు కుటుంబాలతో ఓఆర్ఆర్పై వంటావార్పు చేసి దిగ్బంధం చేస్తామని ప్రకటించారు. రైతులకు రైతు భరోసా డబ్బులు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరగకుండా భరోసా కల్పించారన్నారు. వానకాలం సాగు మొదలైనా ప్రభు త్వం రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ రైతులకు ఎకరానికి రూ. 10 వేలు రైతు భరోసా డబ్బులు ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్ నెలకు రూ.2వేలు ఇస్తే కాంగ్రెస్ రూ. 4వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్ కోతలు మొదలయ్యాయని, వేముల రేవంత్‌రెడ్డి కాదు కోతల రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. పటాన్చెరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులు పంటల సాగు కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందరికీ ఇస్తామని ప్రకటించిందన్నారు . రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో చేశారని గుర్తుచేశారు. యాసంగిలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని, మండలంలో ఒక్క గ్రామంలో మాత్రమే రైతులకు డబ్బులు వేశారన్నారు.
ఒక్కో రైతుకు ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రూ. 12 వేలు బాకీ ఉందని, ముందుగా రైతులకు బాకీ ఉన్న రూ.12 వేలు వేయాలని డిమాండ్ చేశారు. దేవుడి మీద ఒట్టు వేసి హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రైతుల పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీవ్యాపారుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలు చెల్లించి, తిరిగి కొత్త రుణాలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంతో ఎంతోమంది రైతులు బ్యాంకుల్లో ఉన్న అప్పులు చెల్లించారన్నారు.
అప్పులు చెల్లించిన రైతులకు కూడా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు కేసీఆర్ రైతు బీమా పథకం అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రైతు మృతిచెందితే కేసీఆర్ ప్రభుత్వం ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా డబ్బులు చెల్లించిందన్నారు. అసెంబ్లీ సమావేశంలో పంటల బీమా పథకం అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించి మాట తప్పాడని విమర్శించారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలను బంద్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వికారాబాద్, గద్వాల్ జిల్లాల్లో రైతులు పంట భూములు తీసుకోరాదని పోరాటం చేస్తే బేడీలు వేసి జైలులో పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు.
రాష్ట్రంలో రైతు రాజ్యం కాదు బేడీల రాజ్యం నడుస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములు కొనుగోలు చేసేందుకు రియల్ వ్యాపారులు వచ్చేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరం కోసం భూములు అమ్మకం చేస్తామని చెప్పినా ఎవరూ మందుకు రావడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్‌కు వచ్చినప్పుడు ఎమ్మెల్యే మాణిక్‌రావు నియోజకవర్గ అభివృద్ధి కోసం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయాలని కోరినా ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తే డీజిల్‌కు పైసలు లేక పనులు చేయడం లేదన్నారు.
భవిష్యత్‌లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, జహీరాబాద్, దుబ్బాక, నర్సాపూర్ ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేంటర్ ఆదర్శ్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశంగౌడ్, బాల్‌రెడ్డి, మాణిక్యం, తొంట అంజ య్య, సోమిరెడ్డి, చంద్రగౌడ్, ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న రప్ప రప్ప ఫ్లకార్డు
జిన్నారం, జూన్ 21: సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించిన ఫ్లకార్డు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల హీరో అల్లు అర్జున్ ఓ సభా వేదికపై పుష్ప 2 సినిమాలోని రప్ప రప్ప డైలాగ్ చెప్పడం, ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన రప్ప రప్ప డైలాగ్‌లు మహాధర్నాలో మార్మోగాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు ఫొటోతో ఉన్న 2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్ పేరుతో గులాబీ ఫ్లకార్డులు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. దీంతో ముఖ్య నాయకులు, కార్యకర్తలు మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. పటాన్చెరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులు సాగు కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించినా ఇంతవరకు అమలు చేయలేదు. రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి వచ్చింది. వికారాబాద్, గద్వాల్ జిల్లాల్లో రైతులు పంట భూములు తీసుకోరాదని పోరాటం చేస్తే బేడీలు వేసి జైలులో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో రైతు రాజ్యం కాదు బేడీల రాజ్యం నడుస్తున్నది.
– జిన్నారం మహాధర్నాలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
వాగ్దానాలు నెరవేర్చని సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం ఎన్నో ఉచిత వాగ్దానాలు చేసి ఏతుల రేవంత్‌రెడ్డిగా మిగిలిపోయాడు. ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ నాట్లు పడక ముందే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేశారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఓట్లు వస్తేనే రైతు భరోసా వేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం శోచనీయం. ఈ ధర్నా చూసైనా ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమచేయాలి.
– చింతా ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరావాలి
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నాట్లు పడకముందే రైతులకు డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగినా పంట రుణమాఫీ కాలేదు. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు పుట్టడం లేదు. రైతులను ప్రభుత్వం ఆదుకోకుండా విస్మరించింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ సరిహద్దుల్లోని రైతులను వ్యాపారస్తులుగా భావిస్తున్నారు. ఇకడి వారు కూడా రైతులేనని అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. వ్యవసాయ మండలాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పకన పెట్టింది. రైతు భరోసా నిధులు ఎగ్గొట్టకుండా ధర్నా చూసైనా ప్రభుత్వం దిగివచ్చి నిధులు విడుదల చేయాలి.
– సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
ప్రభుత్వాన్ని నిలదీస్తేనే పనులు జరుగుతాయి
పటాన్చెరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతుల పట్ల ప్రభుత్వం తీరు సరైంది కాదు. కొంతమందికే కాకుండా అందరికీ రైతు భరోసా నిధులు జమచేయాలి. కాంగ్రెస్ నాయకులకు బిస్కెట్లు వేస్తే సీఎం రేవంత్‌రెడ్డి తోక చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో ఓ మంత్రి పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కార్యక్రమం ఉన్నా నాకు సమాచారం లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ప్రభుత్వం దిగివచ్చి 1500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించింది. చేతులు ముడుచుకుని కూర్చుంటే పనులు జరగవు. ప్రభుత్వాన్ని ఎకడికకడే నిలదీయాలి అప్పుడే పనులు జరుగుతాయి.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే
తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష
రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న 147 గ్రామాలు, నాలుగు మండలాల రైతులు సీఎం రేవంత్‌రెడ్డికి ఓట్లు వేయలేదా. వారేం పాపం చేశారని రైతు భరోసా నిధులు వేయలేదు. కాంగ్రెస్ నాయకులు ఇంటి ముందుకు వస్తే నిలదీయండి. ప్రభుత్వం ఏ పని చేసినా మోసపూరితంగానే ఉంటుంది. ప్రతి ఒకరూ ఈ విషయం తెలుసుకోవాలి. 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులు, మహిళలు, యువకులను దారుణంగా మోసం చేసింది. రైతన్నకు వెన్ను దున్నుగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష. రైతు భరోసా నిధులు విడుదల చేసేలా స్థానిక కాంగ్రెస్ నాయకులను ఎకడికకడే నిలదీయాలి.
-ఆదర్శ్‌రెడ్డి, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్