సిద్దిపేట, ఏప్రిల్ 4: సిద్దిపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి కాలువల నిర్మాణ పనులను అధికారులు వేగంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఈసారి యాసంగిలో సాగునీటి ఇబ్బందులు తలెత్తాయని, అధికారుల సమన్వయంతో తాతాలిక కాలువ ఏర్పాటు చేయడంతో కొంత ఇబ్బందులు తొలిగాయని, వచ్చే యాసంగి వరకు శాశ్వతంగా కాలువ నిర్మాణం చేయాలని సూచించారు. అందుకు ప్రణాళికలు రూపొందించాన్నారు.
ఈసారి 50వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని, ఆయకట్టు పెరిగిన దృష్ట్యా ఆర్డీ-7, 8, 9 కాలువలు త్వరితగతిన పూర్తిచేసి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్లకు అనుసంధానం చేయాలని సూచించారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు, కాలువల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇరోడ్ లిఫ్ట్ పనులు వేగవంతం చేయాలని, చంద్లాపూర్ లిఫ్ట్ పనులు, కస్తూరిపల్లి, గోపులాపూర్ చెక్‌డ్యామ్ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి ఘన్పూర్ పంప్ హౌస్ ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీలు మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, వేముల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముల్క ల కనకరాజు, ఆంజనేయులు, ఎల్లారెడ్డి, కీసర పాపయ్య తదితరులు పాల్గొన్నారు.