సిద్దిపేట, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో సిద్దిపేట నియోజకవర్గానికి మొండిచేయి చూపింది. రూపాయి నిధులు ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులు రద్దు చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న పనులను మధ్యలో ఆపేసింది. సిద్దిపేటపై కక్షకట్టి నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నది’.. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
హరీశ్‌రావు: కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్‌లో నడుస్తోంది. ప్రజలకు కొత్త పథకాలు అందకపోగా ఉన్న పథకాలు ఒక్కొక్కటిగా పోతున్నాయి. దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇవ్వడం లేదు. న్యూట్రీషన్ కిట్ బంద్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఆలస్యమవుతున్నాయి. అవ్వాతాతలకు పింఛన్ సరిగ్గా రావడం లేదు. కేసీఆర్ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతులకు సకాలంలో రైతుబంధు ఇచ్చినం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కారు రైతు భరోసాకు రాంరాం పెట్టింది. పూర్తిస్థాయిలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు. వడ్లకు బోనస్ బోగస్ అయ్యింది. అనేక పథకాలు ఆగిపోయాయి. అభివృద్ధి కుంటు పడింది. ఏడాదిలో ఒక్క అభివృద్ధి పని ప్రభుత్వం చేసింది లేదు.
హరీశ్‌రావు: సిద్దిపేట నియోజకవర్గంలో రూ. 875.92 కోట్ల పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. సిద్దిపేట నియోజకవర్గంపై రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా కక్ష కట్టింది. శిల్పారామం రూ. 23 కోట్లు, నెక్లెస్ రోడ్డు రూ. 15 కోట్లు, వెటర్నరీ కళాశాల రూ. 300 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రూ.25కోట్లు, రంగనాయక సాగర్ టూరిజం పనులు రూ.100 కోట్లు, వెయ్యి పడకల దవాఖానలో వివిధ సేవలకు రూ. 27 కోట్లు, మహతి ఆడిటోరియం రూ 50 కోట్లు పనులు ఆగిపోయాయి. చింతమడక రెసిడెన్షియల్ స్కూల్ డార్మెట్, క్లాస్‌రూమ్స్ రూ.18 కోట్లు, బీఎస్సీ అగ్రికల్చర్ తోర్నాల రూ. 31 కోట్లు, మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ రూ. 17 కోట్లు, నర్సింగ్ కళాశాల రూ. 20 కోట్లు పనులు మేం పూర్తి చేశాం. మరో రూ. 20 కోట్ల పనులు మధ్యలో ఆగిపోయాయి. టూటౌన్ పోలీస్‌స్టేషన్ రూ. 4 కోట్లు మంజూరు కాగా.. రూ. 2 కోట్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ రూ. 4 కోట్ల 44 లక్షలు ఇంకా పనులు ప్రారంభం కాలేదు. రోడ్లు భవనాల శాఖ నుంచి మంజూరైన రూ. 81.15 కోట్ల పనులు రద్దు చేశారు. రోడ్లు భవనాల శాఖ నుంచి నిధులు మంజూరై పనులు ప్రారంభం కానివి రూ. 47.50 కోట్లు, ఆర్‌ఆండ్‌బీ పనులు మధ్యలో ఆగిపోయినవి రూ. 52.20 కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్డు రూ. 62.63 కోట్లు పూర్తిగా ఆగిపోయాయి. నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నది.
హరీశ్‌రావు: ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నా నియోజకవర్గంలో కోపం పెట్టుకుని అభివృద్ధిని అడ్డుకుంటున్నది. సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో (పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విద్యాలయం) వెటర్నరీ కళాశాలను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. 30ఎకరాల విస్తీర్ణంలో బాలురు, బాలికల వసతితో పాటు కళాశాల నిర్మాణం చేపట్టేలా రూపకల్పన చేశాం. ఇందుకు రూ. 180 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.100 కోట్ల నిధులు కేటాయించి పనులు ప్రారంభించాం. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్దిపేటపై కక్షకట్టి ఈ కళాశాల పనులను రద్దుచేసి కొడంగల్‌కు తరలించుకు పోయింది. అక్కడ ఇంకో కళాశాల పెట్టుకోవాలి. కానీ, సిద్దిపేట కళాశాలను ఎలా తరలిస్తారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీశా. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్ల ద్వారా పంట సాగు విస్తీర్ణం పెరిగింది. పశుసంపద బాగా వృద్ధి చెందింది. జిల్లాతో పాటు చుట్టుపకల జిల్లాలకు అందుబాటులో ఉండేలా సిద్దిపేటలో ప్రభుత్వ వెటర్నరీ కళాశాలను కేసీఆర్ మంజూరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసి ఈ కళాశాలను కొడంగల్‌కు తరలించుకుపోయింది.