సిద్దిపేట, నవంబర్16: తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ప్రజలు మదన్ మోహన్‌కు అండగా నిలిచారని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారని, వారిద్దిని ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటిన ఘనత సిద్దిపేట ప్రజలదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని విక్టరీ చౌరస్తా పారు ప్రాంగణంలో సిద్దిపేట దివంగత మాజీ ఎమ్మెల్యే అనంతుల మదన్మోహన్ విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు శ్యామ్మోహన్,రవీంద్రనాథ్, అనుపమ,సాధన, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, వరంగల్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాసర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో వ్యక్తులు చేసిన సేవలే గుర్తింపు తెచ్చిపెడతాయన్నారు.
ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని మదన్మోహన్ గొప్పగా నడిపించారని గుర్తుచేశారు. మదన్ మోహన్ గురించి శనివారం తనతో కేసీఆర్ గంటసేపు చర్చించారన్నారు. సిద్దిపేటకు కేసీఆర్‌కు, సిద్దిపేటకు మదన్ మోహన్‌కు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదని, వ్యక్తులు చేసిన సేవలే శాశ్వతం అని చాటి చెప్పడమే మన సిద్దిపేట విజన్ అని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటకు సేవ చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక రాజకీయ నేతగా కాకుండా ఒక వ్యక్తిగా మదన్ మోహన్ తనదైన శైలిలో సిద్దిపేటకు సేవ చేశారని కొనియాడారు. అందుకే వారికి ఈ గౌరవం దకిందన్నారు.
గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గురువారెడ్డి విగ్రహం ఇకడ ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తుచేశారు. ఇప్పుడు మదన్ మోహన్‌ను స్మరిస్తూ గౌరవంగా , ఘనంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మదన్ మోహన్ ఎంతో పోరాటం చేశారని కొనియాడారు. ఆ స్ఫూర్తితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మదన్ మోహన్ బతికి ఉంటే ఎంతో సంతోషించేవారన్నారు. ఈనాడు సిద్దిపేట అభివృద్ధి గురించి దేశవిదేశాల్లో ప్రశంసలు దకుతుండడం చూసి మదన్ మోహన్ ఆత్మ సంతోషిస్తూ ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. మదన్మోహన్ సిద్దిపేట అభివృద్ధిని కాంక్షించారని, తనవంతు అభివృద్ధి ఆయన చేశారని, ఆ తర్వాత కేసీఆర్ మరింత అభివృద్ధి చేశారని, ఇప్పుడు తాను కూడా సిద్దిపేట ప్రజల కోసమే శక్తికి మించి పనిచేస్తున్నట్లే హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘కొంతమంది నన్ను అన్నారు… మదన్ మోహన్ వేరే పార్టీలో పనిచేశారు.
ఆయన మరణం తర్వాత వాళ్ల పార్టీ వాళ్లు కూడా ఆయన సేవలు గుర్తించలేదు. మనం ఎలా విగ్రహం పెడతాం’ అని తనతో అన్నట్లు హరీశ్‌రావు ఈ సందర్భంగా అన్నారు. మదన్మోహన్ సేవలను పార్టీలకతీతంగా గుర్తించాలని, ఆయన కృషి శాశ్వతంగా సిద్దిపేట చరిత్రలో నిలవాలని చెప్పి విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా పనిచేసి పెట్టడమే సిద్దిపేట నాయకుల విజన్‌గా ఉండాలనేది తన తపన అని హరీశ్‌రావు అన్నారు. అందుకే తన దగ్గరకు వచ్చే వాళ్లలో అన్ని పార్టీల వాళ్లు ఉంటారని, అందరి పనులు చేస్తానని హరీశ్‌రావు తెలిపారు. ఆ రోజుల్లో సిద్దిపేటలో 100 పడకల దవాఖానను తెచ్చిన నాయకుడు మదన్ మోహన్ అని, ఇప్పుడు దానిని 1000 పడకల దవాఖాన ,మెడికల్ కాలేజీగా అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. మదన్మోహన్, కేసీఆర్ స్ఫూర్తితో తాను సిద్దిపేట అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. మదన్మోహన్ సిద్దిపేట ప్రజలకు, తెలంగాణ ఉద్యమానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని గొప్పగా నడిపిన నాయకుడు అని గుర్త్తుచేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు.
-మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్