వర్గల్, జూన్ 1: బీఆర్ఎస్ కార్యకర్త ఏ ఒక్కరికి ఆపద వచ్చినా పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం వర్గల్ మండలం తున్కిమక్తా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చాకలి కనకయ్య కుటుంబానికి కేసీఆర్ ఆదేశాలతో రూ.5లక్షల చెక్కును హరీశ్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్కతుర్తిలో నిర్వహించిన సభ చరిత్రలో నిలిచి పోతుందన్నారు.
ఎల్కతుర్తి సభలో పాల్గొని ఇంటికి బయలుదేరిన బీఆర్ఎస్ కార్యకర్త చాకలి కనకయ్య తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించడం బాధ కలిగించిందన్నారు.మృతుడి కూతుర్లు అన్విక, శాన్వికను మంచి పాఠశాలలో చదివించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మృతుడి కుటుంబానికి ఇల్లు కట్టిస్తామన్నారు.కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు.
గజ్వేల్‌లో రూ.30 కోట్లతో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని ఇప్పటి వరకు వినియోగంలోకి తేకపోవడం దారుణమని అన్నారు. జహీరాబాద్ ఏరియా దవాఖానలో సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో రోగులకు చికిత్స చేయడం కాంగ్రెస్ అసమర్ధ పాలనకు అద్ధం పడుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాలుయాదవ్ పాల్గొన్నారు.