నర్సాపూర్,డిసెంబర్ 24 : రెండేండ్లు ఓపిక పట్టండి.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధ్యక్షతన బుధవారం ఆయన సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాలుకు బలపం కట్టుకొని తిరగడం ఎప్పుడూ చూడలేదన్నారు.
ఓటమి భయంతో రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడైనా 90 శాతం స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తుందని, కానీ తెలంగాణలో 6000 సర్పంచ్‌లు కాంగ్రెస్ గెలిస్తే 4000 సర్పంచ్‌లు బీఆర్ఎస్ మద్దతులో గెలుపొందారని గుర్తుచేశారు. కాంగ్రెస్ డబ్బు, గూండాయిజం, మద్యం పంపిణీ చేసినా బీఆర్ఎస్ మద్దతుతో 40 శాతం సర్పంచ్‌లు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనియ్యనని అన్నాడని, ఇవాళ 4000 మంది సర్పంచ్‌లు రేవంత్‌రెడ్డి గుండె ల నుంచి మొలకెత్తారన్నారు.
కేంద్రం నుంచి వచ్చే డబ్బులు వందకు రూ.85 రూపాయలు నేరుగా సర్పంచ్ అకౌంట్లోనే జమఅవుతాయని, రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మంజూరైన డబ్బులతో గ్రామాలను అభివృద్ధి చేయాలని, ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి పేర్లు రాసిపెట్టుకోవాలని, అందరి లెక్కలు అధికారంలోకి రాగానే తేలుద్దామని, ఎవరినీ వదిలి పెట్టేది లేదని కార్యకర్తలు, సర్పంచ్‌లకు ధైర్యం చెప్పారు. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు అధైర్య పడవద్దని, మీకు ఖచ్చితంగా భవిష్యత్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి పాలనలో కొత్త పథకాలు దేవుడెరుగు కేసీఆర్ తెచ్చిన పథకాలు బంద్ చేశారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని బంద్ చేశాడని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పాలనలో లగ్గానికి చెక్కు ఇస్తే రేవంత్‌రెడ్డి పాలనలో బిడ్డ పుట్టిన తర్వాత చెక్కులు ఇచ్చే దుస్థితి ఏర్పడిందన్నారు. కల్యాణలక్ష్మి కింద రూ.90 0 కోట్లు ప్రభుత్వం బకాయిపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాడీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని…నర్సాపూర్ నియోజకవర్గంలోని తండాల రోడ్ల కోసం కేసీఆర్ రూ.54 కోట్లు మంజూరు చేశాడన్నారు. కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తే ఎరువులు నేరుగా ఇంటికి వచ్చేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యాప్ తీసుకురావడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నా రు.
దేవుడి గుడి, చర్చి మీద ఒట్టేసి పంటరుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశాడన్నారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. బీఆర్ఎస్ మద్దతుతో చాలామంది సర్పంచ్‌లుగా గెలుపొందారని, ఓడిపోయిన వారు బాధపడవద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఎన్నికల్లో భయపెట్టారు, అరాచకాలు చేశారు, దౌర్జన్యం చేశారు అయినా ప్రజలు బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులనే సర్పంచ్‌లుగా గెలిపించారని గుర్తుచేశారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్, మాజీ మంత్రి హరీశ్‌రావు, నేను ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. పంటలకు సాగు నీరు అందించడానికి పోరాడుతామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు శశిధర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోపి, సత్యంగౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.