పటాన్చెరు రూరల్, జూలై 28: సిగాచి పరిశ్రమ పేలుడులో మరణించిన కుటుంబాలకు బాసటగా ఉంటూ, పరిహారం కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో ఘన స్వాగతం లభించింది. సోమవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ కార్యాలయం ముందు హరీశ్‌రావుకు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ నినాదాలు చేశారు.
సిగాచి బాధిత కుటుంబాలు ప్రభుత్వం, పరిశ్రమ ప్రకటించిన రూ.కోటి కోసం నానా కష్టాలు పడుతున్నాయి. ప్రమాదం జరిగి 29 రోజులు గడుస్తున్నా రూ. కోటి ఊసెత్తడం లేదు. ఈ విషయాన్ని చాలామంది మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ ద్వారా, దరఖాస్తుల ద్వారా తెలుపుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన తక్కువైందని మా తరపున అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడాలని విన్నవిస్తుండటంతో మాజీ మంత్రి వారికి మద్దతుగా సంగారెడ్డి కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఈ మేరకు పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో పరిహారం అందని కుటుంబ సభ్యులు, గాయపడ్డ బాధితులు హరీశ్‌రావుతో పాటు సంగారెడ్డికి బయలుదేరారు. వారితో పాటు పెద్దసంఖ్యలో వాహనాల్లో బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లాయి.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేశంగౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సింధూఆదర్శ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు కొలన్బాల్రెడ్డి, గడీల శ్రీకాంత్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్యయాదవ్, మాజీ సర్పంచ్ బురిగారి వెంకట్‌రెడ్డి, మోటే కృష్ణయాదవ్, మాజీ ఉప సర్పంచ్ కిట్టు ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు మెరాజ్‌ఖాన్, యువ నాయకులు మాణిక్‌యాదవ్, రామకృష్ణ ముదిరాజ్, సునీల్, చందు ముదిరాజ్, సల్మాన్, వీరేశంగౌడ్, షకీల్, బీఆర్ఎస్ నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.