వికారాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): జిల్లా ఖజానా శాఖ కార్యాలయంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. అందులో పని చేస్తున్న కొందరు సిబ్బంది ప్రతి పనికీ పైసలిస్తేనే పనులు చేస్తున్నారని.. లేకుంటే సంబంధిత బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదలుకొని వారి పిల్లల చదువు కోసం తీసుకునే రుణాలు, కాంట్రాక్లర్లకు బిల్లుల చెల్లింపుల వరకు అంతా ట్రెజరీ శాఖ ద్వారానే జరుగుతుంది. ఉద్యోగుల జీతాలు, ఇంక్రిమెంట్లు, ఏరియర్స్, సరెండర్ పీఎఫ్‌లు, ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వరకు పర్సంటేజీ లేనిదే పనిచేయడం లేదనే ఆరోపణలు జిల్లా ట్రెజరీ అధికారులతోపాటు సబ్ ట్రెజరీ ఆఫీసర్లపై వెల్లువెత్తుతున్నాయి. డీటీవో, ఎస్టీవో కార్యాలయాల్లో పనిచేసే అధికారులు మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్ల వరకు ఒక్కొక్కరికీ ఒక్కో పర్సంటేజీ ఇవ్వాలనే తంతు ఆయా కార్యాలయాల్లో కొనసాగుతున్నది. డీటీవో, ఎస్టీవో కార్యాలయాల్లో నడుస్తున్న లంచాల వ్యవహారం తెలిసిన వారు పైసలిచ్చి పనులు చేయించుకుంటుండగా.. పైసలివ్వని వారు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఆఫీసుల్లో లంచాలు ఇవ్వనిదే పనులు జరగడంలేదన్న విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
పర్సంటేజీ ఇవ్వాల్సిందే..
జిల్లాలోని ఎస్టీవో కార్యాలయాల్లో పైసలివ్వనిదే ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్ ఫైల్ అయితే ఓ రేట్, బ్యాంకు రుణాలకు సంబంధించిది అయితే మరో రేట్, కాం ట్రాక్టర్ల బిల్లులను బట్టి ఓ రేట్‌ను ఫిక్స్ చేసి మరీ ట్రెజరీ అధికారులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఎదో కారణం చెప్పి ఫైళ్లను పెండింగ్‌లో పెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ మొదలుకొని ఫైల్ వెళ్లే ప్రతిచోటా పైసలివ్వనిదే పని కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఓ జిల్లా అధికారి తన కుమారుడ్ని విదేశాల్లో ఉన్నత చదువులు చదివించేందుకు పెట్టుకున్న బ్యాంకు రుణానికి సంబంధించిన ఫైల్‌కు కూడా పది శాతం పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని అధికారులు పట్టుబట్టగా.. అతడు అడిగినంత ఇచ్చిన తర్వాతే ఆ ఫైల్‌ను క్లియర్ చేసినట్టు తెలిసింది.
కొందరు జిల్లా స్థాయి అధికారులు సొంత వాహనాలు వినియోగిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్స్‌లను పొందడం.. మరికొంతమంది ప్రభుత్వ వాహనాలను వాడుతూనే సొంత వాహనాలనూ వినియోగిస్తున్నట్టు తప్పుడు బిల్లులు పెట్టి వెహికల్ అలెవెన్స్‌లను పొందుతున్నారనే ప్రచారమూ జరుగుతున్నది. ఇదే అదునుగా తీసుకుంటున్న అధికారులు వెహికల్ అలవెన్స్ ఫైల్ అప్రూవల్ కోసం ప్రతినెలా రూ.4-5 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చే అలవెన్స్‌లు ట్రెజరీ కార్యాలయాల్లో వారి వివరాలను ఆన్లైన్ చేస్తేనే అవి మంజూరవుతాయి.. వాటిని ఆన్లైన్ చేసేందుకు కూడా ట్రెజరీ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ట్రెజరీ, సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులను కోరుతున్నారు.