సిద్దిపేట, ఫిబ్రవరి 9 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసి మంత్రివర్గంలో 42 శాతం పదవులను బీసీలకు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణయాదవ సంఘం ఫంక్షన్‌హాల్ కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదవ సంఘం సభ్యులు ఫంక్షన్‌హాల్‌ను మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారని, ఫంక్షన్‌హాల్ వల్ల వచ్చే డబ్బులను పేద విద్యార్థులకు ఖర్చు చేయాలన్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యాదవుల గొప్పతనాన్ని అసెంబ్లీలో చెప్పి గౌరవాన్ని పెంచారన్నారు. అనేక మంది యాదవ నాయకులను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క యాదవ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోగా కనీస గుర్తింపు కూడా లేదన్నారు. గొల్లకుర్మల అభ్యున్నతికి గొర్రె పిల్లలను కేసీఆర్ పంపిణీ చేస్తే, రెండో విడత గొర్రె పిల్లలు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా డీడీలు వాపస్ ఇస్తుందన్నారు. హైదరాబాద్‌లోని మంచిరేవులలో వంద కోట్ల విలువ చేసే భూమి ఇచ్చి యాదవ భవనాలు నిర్మించారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కులానికి, వర్గానికి సహాయం అందించలేదన్నారు. కాంగ్రెస్‌ది ఎగవేతల ప్రభుత్వమన్నారు. బీసీ బంధు చెక్కులను సైతం నిలిపివేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ఓట్లు కావాలి కానీ.. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు చేరి 8 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ఇచ్చింది గుండు సున్న.. తెచ్చింది గాడిద గుడ్డు అన్నారు. తెలంగాణకు నిధులు ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు.
ఆంధ్రాకు నిధుల వరద పారించి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. రెండో విడత గొర్రె పిల్లలు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే తెలంగాణకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్నారు. తెలంగాణను దోచుకొని రేవంత్‌రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెడితే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కోసం 11 సార్లు ఢిల్లీకి వెళ్లినా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.
ముఖ్యమంత్రికి రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదని విలేకరులు ప్రశ్నిస్తే తనతో రాహుల్‌గాంధీ మాట్లాడారని ఫోన్ చూపించుకునే దౌర్భాగ్యం రేవంత్‌రెడ్డిది అన్నారు. నేడు రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా, మంత్రివర్గ విస్తరణ చేయాలన్నా ఢిల్లీ అనుమతి తప్పనిసరైందన్నారు. నేడు ఏ పని జరగాలన్నా మంత్రులు 30 శాతం కమిషన్లు అడుగుతున్నారని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలై భూముల రేట్లు భారీగా పడిపోయాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ డబ్బు లు దొరికాయి కానీ కాంగ్రెస్ పాలనలో డబ్బులు దొరకడం లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కమిషన్ల కోసం గొడవ జరుగుతుందన్నారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు.
గతంలో ఏమారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరం భూమి రూ.30 నుంచి రూ.50 లక్షలు ఉండేదని, నేడు ఆపదకు అమ్ముకుందామన్నా రూ.15 లక్షలకు కూడా అమ్ముడుపోవడం లేదన్నారు. జీవాలకు నీరు దొరకని పరిస్థితి నుంచి కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయన్నా రు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, యాదవసంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మామిండ్ల అయిలయ్య, ఫంక్షన్‌హాల్ అధ్యక్షుడు రాజు, కౌన్సిలర్ చంద్రం, యాదవ సంఘం నాయకులు ఎల్లంయాదవ్, దాసరి శ్రీనివాస్, రమేశ్, బాలమల్లు, శ్రీనివాస్, గుండెల్లి వేణు, ఉండ్రాల రాజేశం పాల్గొన్నారు.