నారాయణరావుపేట, జూన్ 6 : సకాలంలో ధాన్యం కొనక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని, రెండు నెలలుగా కల్లాల వద్ద వడ్లు పోసుకొని కాంటాకు ఎదురుచూస్తున్న రైతుల గోస ప్రభుత్వానికి కనపడటం లేదా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేటకు చెందిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. నారాయణరావుపేటలో రైతు మృతదేహానికి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. కనకయ్య మృతి తీవ్రంగా కలిచి వేసిందని,ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి ఆర్థిక సహా యం చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వల్లే నారాయణరావుపేటలో రైతు కనకయ్య బలి అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. కనకయ్య పండించిన వడ్లను మారెట్ యార్డులో దాదాపు 45 రోజుల పాటు ఎవరూ కొనకుండా ఆలస్యం చేశారన్నారు. చివరికి వర్షం పడి ఆ వడ్లన్నీ తడిసిపోయాయన్నారు. తడిసిన వడ్లను మిల్లుకు తీసుకెళ్లి ప్రాధేయపడితే, నాలుగు ట్రాక్టర్ల వడ్లకు ఏకంగా 40 సంచుల వడ్లను మిల్లర్లు కట్ చేశారని ఆరోపించారు.

40 సంచుల వడ్లు కట్ చేసిండ్రు అని శుక్రవారం రాత్రి వరకు తోటి రైతులతో, కుటుంబ సభ్యులతో చెప్పి కనకయ్య బాధపడ్డాడని, ఆ టెన్షన్ లోనే నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని ప్రభుత్వంపై హరీశ్‌రావు మండిపడ్డారు. కుకునూరుపల్లి దగ్గర ఒక రాజస్థాన్ లారీలో వడ్లు ఎకించే ప్రయత్నం చేస్తే, ఆ లారీ వడ్లతో సహా రాజస్థాన్ వెళ్లిపోయిందన్నారు.
దుబ్బాక మండలం చేర్వాపూర్‌లో సంచులు ఎత్తకపోవడం వల్ల, ఎన్సాన్‌పల్లిలో కొనుగోలు చేయకపోవడంతో వడ్లు మొత్తం చెదలు పట్టిపోతున్నాయని తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గమైన అల్లాదుర్గం మండలం వెంకటాపూర్‌లో ఇప్పటి వరకు ఒక క్వింటాల్ వడ్లు కూడా కొనలేదన్నారు. అక్కడ ఎకడి వడ్లు అకడే ఉన్నాయని హరీశ్‌రావు అన్నారు.ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుబంధు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. నాలుగు నెలలుగా రాష్ట్రంలో చనిపోయిన రైతులకు రైతుబీమా అందడం లేదు, దానిని రద్దు చేశారని హరీశ్‌రావు అన్నారు. రైతులను అధికారులు, మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మరణించిన కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మాటలు కట్టిపెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ధప్రాతిపదికన వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.