సిద్దిపేట, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈనెల 27న ఎలతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇది ఎంతో ముఖ్యమైన సభ అని, దీన్ని విజయవంతంగా చేసేందుకు ప్రతి ఒకరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిలు, ఇతర నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, ఇది యావత్ తెలంగాణకు పండుగ అన్నారు. తెలంగాణలోని ప్రతి ఒకరి విజయోత్సవంగా దీనిని అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించినా, పదేండ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపినా అది కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమైందని పేర్కొన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన పార్టీ 25 ఏండ్ల పండుగలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాహనాల ఏర్పాటు, నీటి వసతి, భోజనం సహా ఏ విషయంలోనూ కార్యకర్తలకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలన్నారు.
వేసవి నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సాయంత్రం 5 గంటల్లోపు సభా స్థలికి వచ్చేలా బాధ్యత తీసుకోవాలన్నారు. సభ పూర్తయిన తర్వాత కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సురక్షితంగా ఇండ్లకు చేరేలా ఇన్చార్జిలు, నాయకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. సమన్వయంతో ఉంటూ, క్రమశిక్షణ పాటిస్తూ బహిరంగ సభను సక్సెస్ చేసి సత్తా చాటాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
పటాన్చెరు, ఏప్రిల్ 25 :బీఆర్ఎస్ పార్టీ ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభతో తెలంగాణ భవిష్యత్‌ను మారుస్తుందని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసే ప్రసంగం కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైనట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రపురం, జిన్నారం, గుమ్మడిదల మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సభకు తరలి వస్తారని, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసినటుల తెలిపారు.
సభకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలో వాల్ రైటింగ్, పోస్టర్లు, సన్నాహక సమావేశాలు పూర్తిచేసినట్లు తెలిపారు. ఎన్నికలొస్తే తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని, ఊరూరా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు సిద్ధమయ్యారని, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రతిరోజు దిశానిర్దేశం చేస్తున్నారని ఆదర్శ్‌రెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బురుగడ్డ గ్రామానికి చెందిన రవికుమార్ అనే యువకుడు కేసీఆర్‌పై ఉన్న అభిమానంలో రెండురోజులుగా తన స్వగ్రామం నుంచి పాదయాత్రగా కేసీఆర్ సభకు బయలుదేరాడు. శుక్రవారం ఉదయం రవికుమార్ పాదయాత్ర సిద్దిపేట జిల్లా మిట్టపల్లికి చేరుకున్నది.
– సిద్దిపేట, ఏప్రిల్ 25