సిద్దిపేట, ఏప్రిల్ 10: సిద్దిపేట నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. వడగండ్ల వానకు రైతుల ఆరుగాలం కష్టం నేల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో వరి, మొకజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.
నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.20వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషిచేస్తానని హరీశ్‌రావు మనో ధైర్యాన్ని నింపారు.