పేదింటికి చెందిన కవితకు ఆ ఊరికే చెందిన మాటలు రాని ఓ అబ్బాయికి ఇచ్చి పెండ్లి చేశారు.. పెండ్లి అయినంక అబ్బాయి ఏమి పని చేయకుండా ఖాళీగా ఉంటుండే వాడు. అమ్మాయి అత్తామామ కూడా ఏమి పట్టించుకోకపోతుండే. దీంతో ఏమి చేయాలతో తోచక కవిత ‘ముందడుగు ఆదర్శ మహిళా ఫెడరేషన్’ను సంప్రదించింది. వారు అత్తామామ, భర్తను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి మాటలు రాని అబ్బాయి మంచిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ కుటుంబం సంతోషంగా ఉంది.. ఇలా మహిళలు ఎదుర్కొనే సమస్యలకు మహిళా ఫెడరేషన్ పరిష్కారం చూపుతున్నది. మరోవైపు మహిళలు చదువుకొనేలా ప్రోత్సహిస్తున్నది. ఆర్థికంగా ఎదిగేందుకు ఉమ్మడి వ్యవసాయానికి ఆర్థిక సహాయం అందించి చేయూతగా నిలుస్తున్నది.. భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సహకారంతో ఫెడరేషన్ పని చేస్తున్నది.
హుస్నాబాద్ టౌన్, డిసెంబర్ 6 : కాలం మారుతున్నా మహిళలపై అకృత్యాలు తగ్గడం లేదు.. భర్త వేధింపులు.. ప్రేమించి పెండ్లికి ముఖం చాటేయడం.. ఇలా ఏదో చోట మహిళలు హింసకు గురువుతున్నారు.. మహిళలను సంఘటితం చేసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ‘ముందడుగు ఆదర్శ మహిళా ఫెడరేషన్’ కృషి చేస్తున్నది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో గ్రామస్థాయి సంఘాలను ఏర్పాటు చేసింది. మహిళల ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు వారిని నిరంతరం చైతన్యపర్చేలా సంఘం పనిచేస్తున్నది.
36 గ్రామాల్లో సంఘం సేవలు..
హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, సైదాపూర్ మండలాల్లోని 36 గ్రామాల్లో దాదాపు 3వేల మందికి పైగా మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులపై గ్రామస్థాయితోపాటు విద్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నారు. సమస్యలను ఎదుర్కొనేలా చైతన్యపరుస్తున్నారు.
గ్రామాల్లో సంఘాన్ని సంప్రదిస్తే..
భార్యాభర్తల తగాదాలు.. ప్రేమించి మోసానికి గురి కావడం.. ఇలా పలు రకాల సమస్యలు ఉన్నవారు ముందడుగు ఆదర్శ మహిళా ఫెడరేషన్‌ను సంప్రదిస్తే, గ్రామాల్లో పని చేసే సంఘాలు ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయి. అందుకుగాను తప్పనిసరిగా సంఘానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును పరిశీలించి న్యాయకమిటీ చర్చిస్తుంది. ఆయా కుటుంబాలకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తుంది. కుటుంబాలు సాఫీగా సాగేలా కృషి చేయడంతో పాటు వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నది. దీంతో కోర్టులోని న్యాయసేవ సంస్థ సహాయాన్ని సైతం అందించేందుకు కృషి చేస్తున్నది.
మండల, గ్రామస్థాయిలో కమిటీలు..
మహిళల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారు సమాజంలోని పలు అంశాల్లో ముందుకెళ్లేలా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ముందడుగు ఆదర్శ మహిళా ఫెడరేషన్ మండలస్థాయి, గ్రామస్థాయిలో పలు కమిటీలను ఏర్పాటు చేసి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మండల స్థాయిలో పరిపాలన, న్యాయకమిటీ, ఆర్థిక సుస్థిరత, గ్రామస్థాయిలో పంచాయతీరాజ్, ఆరోగ్యం, చదువు, సామాజిక అంశాలు, సహజ వనరులు, సుస్థిరత కమిటీలు పని చేస్తున్నాయి.
భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ద్వారా చేయూత..
ఆయా గ్రామాల్లో ఏర్పడిన మహిళా సంఘాలకు భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంస్థ ద్వారా ఆర్థిక సాయం చేస్తూ చేయూతనిస్తున్నారు. సమిష్టిగా వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చిన మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఈ సహాయాన్ని తిరిగి చెల్లించకుండా వచ్చిన కొంత లాభాన్ని సంఘం అభివృద్ధికి వినియోగించుకునే వెసులు బాటును కల్పిస్తున్నారు. ఇలా హుస్నాబాద్, పోతారం(ఎస్), గౌరవెల్లి, కుందనవానిపల్లి తదితర గ్రామాల్లోని సంఘాలకు ఆర్థిక సహాయం అందించారు.
సంఘం భవనాలు..
పలు గ్రామాల్లో సంఘం పేరిట భవనాలను నిర్మించి, సంఘ కార్యాకలాపాలను నిర్వహిస్తున్నారు. మహిళలకు సంబంధించిన సమస్యలపై సంఘం సభ్యులు సమావేశం కావడం, పంచాయితీలను ఇక్కడే పరిష్కరిస్తున్నారు.
మహిళలపై హింసకు వ్యతిరేకంగా..
మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మా ఉద్యమం కొనసాగుతున్నది. సంఘాలను బలోపేతం చేయడం, మహిళలను చైతన్యపరిచేలా అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తున్నాం. సామాజిక అంశాలు, మహిళల హక్కులకు సంబంధించిన సమస్యలపై స్పందించేలా ముందడుగు ఆదర్శ మహిళా ఫెడరేషన్ చేస్తున్న కృషికి మా సహకారాన్ని అందిస్తున్నాం. హింసకు గురయ్యే, ఇబ్బందులు పడే అనేకమంది మహిళల సమస్యలు పరిష్కరించాం. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ద్వారా గ్రామ సంఘాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. కోర్టులు, పోలీసుల దగ్గరికి వెళ్లలేనివారికి న్యాయ సహాయం అందిస్తున్నాం.
– డాక్టర్ ప్రశాంతి, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ డైరెక్టర్
కష్టాల్లో ఉన్న మహిళలకు మేలు చేయాలని..
ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు అనేక కష్టాలు పడుతున్నారు. వారికి మాలాంటి సంఘం ఆదుకుంటున్నది. వారి సమస్యను విని, పరిష్కరించేందుకు కృషి చేస్తున్న. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లి మహిళల సమస్యలు తెలుసుకుంటున్నాం. ఈ సంఘం చేయబట్టే అందరికి పనిచేసే స్థాయికి వచ్చిన. మహిళా సంఘంతోనే నాకు గుర్తింపు వచ్చింది. అందరి కోసం పని చేయాలనే తపనతో సంఘంలో చేరిన.
– కాశవేని రజిత, రాములపల్లి
భార్యభర్తల సమస్యలు తీరుస్తున్నాం..
చిన్నచిన్న కారణాలతో దూరంగా ఉన్న భార్యాభర్తలను కలపడం.. సమస్యకు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపడం మా పని. మొదట్లో ఇండ్లకు వెళ్లి కేసులు పరిష్కరిస్తుండే. ఇప్పుడు హుస్నాబాద్ సంఘం దగ్గరకు పిలిచి, కౌన్సెలింగ్ ఇస్తున్నం. అందరిని కలుపుతున్నం. మా సంఘం చేసే పనిని చూసి ఎంతోమంది మహిళలు ఈ సంఘంలో చేరారు. మహిళలకు ఈ సంఘం ఎంతగానో ధైర్యం ఇస్తున్నది. ఎవరైనా మా సంఘానికి వచ్చి సమస్య చెప్పుకోవచ్చు. మహిళలతోపాటు మగవాళ్ల సమస్య కూడా పరిష్కరిస్తాం.
– నీరటి శేషమ్మ, హుస్నాబాద్ మండల న్యాయ కమిటీ సభ్యురాలు, జనగామ
సంఘం ద్వారానే సంతకం నేర్చుకున్న..
ఈ సంఘంలో చేరినంక సదువు అందరికి రావాలని అన్నరు. బస్సు పేరు కూడ తెలియకపోతుండే నాకు. ఈడనే సంతకం చేసుడు నేర్చుకున్న. ఆడోల్లకు సమస్య వస్తే న్యాయం చేసేందుకు మా న్యాయ కమిటీ కూసొని భార్యాభర్తల కష్టసుఖాలు విని పరిష్కారం చేసేటోల్లం. మొదట్లో నన్ను సంఘంలోకి వద్దనేది.. కానీ, నేను చేసే పనిని చూసి మా బాపు, మా ఆఆయన అందరు నాకు సాతిచ్చిండ్రు. ఆడోల్ల సమస్యలపై న్యాయ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్న.
– పుల్లూరి ఈరవ్వ, హుస్నాబాద్ మండల న్యాయకమిటీ సభ్యురాలు, గౌరవెల్లి
సమత సొసైటీ అప్పటి నుంచి పని చేస్తున్న..
నేను సమత సొసైటీ ఉన్నప్పటి నుంచి మహిళల కోసం పని చేస్తున్న. మహిళల సమస్యలపై గ్రామస్థాయిలో సంఘాలను ఏర్పాటు చేయిస్తున్నాం. మహిళలపై హింస, వేధింపులు జరుగకుండా చైతన్య పర్చేందుకు సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతోమంది మహిళల కష్టాలు తీర్చాం. వారు సైతం ఈ సంఘంలో చేరి మహిళల కోసం పాటు పడుతున్నారు.
– కక్కెర్ల భాగ్య, జిల్లా కోఆర్డినేటర్ భూమిక ఉమెన్స్ కలెక్టివ్, సిద్దిపేట జిల్లా
స్వతంత్రంగా నడుచుకునేలా..
మహిళా ఫెడరేషన్ స్వతంత్రంగా నడుచుకునేలా కృషి చేస్తున్నది. నిధులను ఎలా సమకూర్చుకోవాలి? అధికారులతో ఎలా వ్యవహరించాలి? అనే విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం.
– వాసవి, భూమిక ఫీల్డ్ కోఆర్డినేటర్,హుస్నాబాద్